21-02-2025 12:00:00 AM
సీసీ కెమెరాల వ్యాపారం ముసుగులో విక్రయం
మంచిర్యాల, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి) : జిల్లా కేంద్రంలో సీసీ కెమెరాల వ్యాపారం ముసుగులో గాంజా వ్యాపారం చేస్తున్న ముఠాను మంచిర్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం రామగుండం సీపీ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం... మంచిర్యాల ఐబి చౌరస్తాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంప్లెక్స్ కింద సెల్లార్ లో సోమ ప్రవీణ్ కుమార్ వై ఇన్ఫో సొల్యూషన్స్,
సీసీ కెమెరాల షాప్ గోదాంలో చట్ట వ్యతిరేకంగా గంజాయి నిలువ ఉందనే సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి గోదాంలో కాటన్ బాక్స్ లలో ప్యాక్ చేసి ఉన్న గంజాయితో పాటు అక్కడ ఉన్నవారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ దాడిలో రూ. 11.75 లక్షల విలువ చేసే 23.5 కిలోల గంజాయి, 11 ఫోన్లు, 5 బైక్‌లు, ఒక ఎలక్టానిక్ వేయింగ్ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఈ కేసులో మొత్తం 22 మంది ఉండగా ఇందులో 11 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు సిపి తెలిపారు. పట్టుబడిన వారిలో ఇరుగురాళ్ల సతీష్ కుమార్, మహ్మద్ సమీర్, మైనర్, భీమ అనుదీప్, మొహమ్మద్ అబ్దుల్ ఉబేద్, అర్జున్ బాబురావు చౌహాన్, జాడి రాఘవేంద్ర స్వామి, గూడూరు రాము, ఎస్.కె అథహార్, ఎస్.కె సమీర్ లు ఉన్నారన్నారు.
పరారీలో సోమ ప్రవీణ్, తగరపు రాజు, తగరపు శృతి, తగరపు వినయ్, రామాలయం రాకేష్, శ్రీధర్, మున్నీ, చింటూ, అల్మేకర్ శ్యామ్, క్వార్టర్ సాయి, సోహెల్ లు ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామన్నారు. చాకచక్యంగా పట్టుకున్న మంచిర్యాల ఎస్ హె ఓ ప్రమోద్ కుమార్ ను అభినందించారు.
ఈ విలేకరుల సమావేశంలో పెద్దపల్లి డీసీపీ చేతన, డిసిపి అడ్మిన్ రాజు, ఏసీపీ స్పెషల్ బ్రాం రాఘవేంద్ర, మంచిర్యాల ఏసీబీ ప్రకాశ్, టాస్క్ ఫోర్స్ ఏసిపీ మల్ల రెడ్డి, సీఐ లు ప్రమోద్ రావు, టాస్క్ ఫోర్స్ సీఐలు రాజ్ కుమార్, రమేష్, టాస్క్ ఫోర్స్ ఎస్సులు లచ్చన్న, ఉపేందర్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.