calender_icon.png 13 January, 2025 | 11:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మందగించిన కీలక రంగాలు

01-01-2025 12:00:00 AM

నవంబర్‌లో 4.3 శాతానికి తగ్గిన వృద్ధి 

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: దేశంలోని ఎనిమిది కీలక మౌలిక రంగాల వృద్ధి మందగించింది. 2024 నవంబర్‌లో వీటి వృద్ధి రేటు 4.3 శాతానికి తగ్గినట్లు మంగళవారం విడుదలైన అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2023లో ఈ కీలక రంగాలు 7.9 శాతం వృద్ధి సాధించాయి. నెలవారీగా చూస్తే మాత్రం వృద్ధి రేటు పెరిగింది. 2024 అక్టోబర్‌లో ఈ రంగాలు 3.7 శాతం వృద్ధిచెందాయి.

నవంబర్ నెలలో క్రూడాయిల్, నేచురల్ గ్యాస్ ఉత్పత్తి క్షీణించడంతో మొత్తంగా మౌలిక రంగాల వృద్ధి మందగించింది. బొగ్గు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, విద్యుత్ రంగాల వృద్ధి రేట్లు ఈ నవంబర్‌లో 7.5 శాతం, 2.9 శాతం, 2 శాతం, 4.8 శాతం, 3.8 శాతం కాగా, గత ఏడాది నవంబర్‌లో వీటి వృద్ధి రేట్లు వరుసగా 10.9 శాతం, 12.4 శాతం, 3.3 శాతం, 9.7 శాతం, 5.8 శాతంగా నమోదయ్యాయి.

2024 నవంబర్‌లో సిమెంటు రంగం ఉత్పత్తి మాత్రం 13 శాతం పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్ మధ్యకాలంలో ఎనిమిది కీలక రంగాలు వృద్ధి 4.2 శాతమే. గత ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో వీటి వృద్థి 8.7 శాతంగా నమోదయ్యింది. పారిశ్రామికోత్పత్తి సూచీలో ఈ ఎనిమిది కీలక రంగాలకు 40.27 శాతం భాగస్వామ్యం ఉన్నది.