* భూసేకరణలో ఆస్తులు ప్రభావితమవుతన్న వారికి నష్టపరిహారం
* మంత్రి పొన్నం, ఎంపీ అసదుద్దీన్ చేతులమీదుగా నేడు చెక్కల పంపిణీ
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 5(విజయక్రాంతి): మెట్రో ఫేజ్ భాగంగా హెచ్‌ఏఎంఎల్ చేపట్టిన పాతబస్తీ (ఎంజీబీఎస్ కారిడార్ 6 నిర్మాణం కోసం భూసేకరణ పనులు కీలకఘట్టానికి చేరుకున్నాయి. ఈ కారిడార్ నిర్మాణం కోసం ప్రభావిత ఆస్తుల యజమానులకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించబోతోంది.
పాతబస్తీ మెట్రో కారిడార్ నిర్మాణంలో ఆస్తులు కోల్పోతున్న వారిలో 40మందికి నేడు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ కలెక్టరేట్‌లో రాష్ట్ర రవాణా శాఖ, హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చేతుల మీదుగా నష్టపరిహారం చెక్కులను అందించేందుకు మెట్రో, కలెక్టరేట్ అధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా భూసేకరణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న పాతబస్తీ మెట్రో కారిడార్ నిర్మాణ పనులు అతి త్వరలో పట్టాలెక్కబోతున్నాయి. రేపో, మాపో కూల్చివేతలను చేపట్టే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు 169మంది సమ్మతి..
మెట్రో ఫేజ్ 2 కారిడార్ మార్గంలో 1100 ఆస్తులు ప్రభావితం అవుతండగా.. వాటి యజమానులు స్వచ్ఛందంగా తమ స్థలాలను ఇవ్వడానికి ముందుకువస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 169మంది తమ సమ్మతిని తెలుపుతూ అనుమతి పత్రాలు ఇచ్చారని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు త్వరితగతిన పాతబస్తీ మెట్రో పనులు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా 40ఆస్తుల యజమానులకు చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.
భూసేకరణ చట్టానికి లోబడి నష్టపరిహారం
భూసేకరణ చట్టానికి లోబడి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నిర్ణయం మేరకు నష్టపరిహారం చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. ప్రభావిత ఆస్తులకు గజానికి రూ.81వేలు ఇవ్వాలని కలెక్టర్ అనుదీప్ నిర్ణయించారు. దీంతో పాటు రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ చట్టం ప్రకారం పునరావాస పరిహారం, తొలగించే నిర్మాణాలకు నష్టపరిహారాన్ని కూడా అర్హులైన యాజమాన్యాలకు ఇస్తామని ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.
నేటి ప్రజావాణి రద్దు..
పాతబస్తీ మెట్రో భూనిర్వాసితులకు నేడు కలెక్టరేట్‌లో నష్టపరిహారాన్ని అందజేస్తున్నందున నేడు జరుగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకే ఈ కార్యక్రమాన్ని రద్దు చేశామని కలెక్టర్ తెలిపారు. వచ్చే సోమవారం యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.