30-03-2025 01:11:46 AM
హిమాచల్ ప్రభుత్వంతో తెలంగాణ సర్కారు ఎంఓయూ
పునరుత్పాదక విద్యుత్ రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెడతాం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సిమ్లాలో హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్‌తో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, మార్చి 29 (విజయక్రాంతి): క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ- 2025 లక్ష్యసాధనలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. 520 మెగావాట్ల హైడల్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు హిమాచల్‌ప్రదేశ్‌తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఎంఓయూను తెలంగాణ విద్యుత్ చరిత్రలో చారిత్రక మైలు రాయిగా డిప్యూటీ సీఎం భట్టి అభివర్ణించారు.
శనివా రం రాష్ట్ర విద్యుత్ శాఖ బృందంతో కలిసి హిమాచల్‌ప్రదేశ్ రాజధాని సిమ్లాకు డిప్యూటీ సీఎం వెళ్లారు. అనంతరం ఆ రాష్ట్ర సీఎం సుఖ్విందర్ సింగ్ సుక్కుతో భేటీ అయ్యారు. సుఖ్విందర్ సింగ్, భట్టి సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ర్టంలో వేగంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ ఒప్పందం చేసుకున్నట్టు చెప్పారు.
విద్యుత్ వనరుల విస్తరణలో ఇది మంచి పరిణామమన్నారు. జల విద్యుత్ అత్యంత విశ్వసనీయమైన గ్రీన్ పవర్ అని ఆయన పేర్కొన్నారు. థర్మల్ పవర్‌తో పోల్చినప్పుడు హైడల్ పవర్ ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా థర్మల్ పవర్ ఉత్పత్తి ఖర్చు ప్రతి సంవత్సరం పెరుగుతూ.. ఉండగా హైడల్ విద్యుత్ ఉత్పత్తి ఖర్చు క్రమంగా తగ్గుతూ వస్తున్నదని చెప్పారు.
గ్రీన్‌పవర్ సామర్థ్యాన్ని పెంచుతాం
హిమాచల్‌ప్రదేశ్ హిమాలయ పరీవాహక నదులతో నిండి ఉన్న రాష్ర్టమని, ఏడాదిలో 9 నుంచి 10 నెలల పాటు అక్కడ హైడల్ పవర్ ఉత్పత్తికి వాతావరణం అనువుగా ఉంటుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. హిమాచల్‌తో పోలిస్తే దక్షిణ భారతదేశ నదులపై హైడల్ విద్యుత్ ఉత్పత్తి కాలం పరిమితంగా ఉంటుందన్నారు. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్ సహజ వనరులను వినియోగించుకొని తెలంగాణ ప్రజలకు తక్కువ ధరకు, పర్యావరణహిత విద్యుత్‌ను అందించాలనే అందించనున్నట్టు చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ పవర్ సామర్థ్యాన్ని పెంచేందుకు నిరంతరం కృషి చేస్తోందని వివరించారు. ఈ ఒప్పందం తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో పాటు హిమాచల్ ప్రదేశ్ హైడ్రో ఎలక్ట్రిక్ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాడనికి సహా యపడుతుందని పేర్కొన్నా రు. పునరుద్పాతక విద్యు త్ రం గంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెడతామని చెప్పా రు.
ఈ ఒప్పంద కార్యక్రమంలో రాష్ర్ట ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్‌పీడీసీఎల్ సీఎండీ ము షారఫ్ ఫరూఖీ, జెన్‌కో హైడల్ డైరెక్టర్ సచ్చిదానంద, హిమాచల్ ప్రదేశ్ ఎనర్జీ డైరెక్టర్ రాకేశ్ ప్రజాపతి, ఆ రాష్ట్ర స్పెషల్ సెక్రటరీ ఎనర్జీ అరిందం చౌదరి పాల్గొన్నారు.
ఒప్పందంలోకి కీలకాంశాలు
* తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వాల మధ్య విద్యుత్ ఉత్పత్తిపై అవగాహన ఒప్పందం
* సెలి (400 మెగావాట్లు), మియార్ (120 మెగావాట్లు) జల విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధిలో తెలంగాణ భాగస్వామ్యం
* తెలంగాణ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 ప్రకారం 2030 నాటికి 20,000 మెగావాట్లు, 2035 నాటికి 40,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం లక్ష్యం.
* హిమాచల్ జలవనరుల వినియోగం ద్వారా, తెలంగాణ ప్రజలకు తక్కువ ఖర్చుతో పర్యావరణహిత విద్యుత్ సరఫరా
* థర్మల్ పవర్‌తో పోల్చినపుడు హైడ్రో విద్యుత్ ఉత్పత్తి వ్యయం తక్కువ
* తెలంగాణ జెన్‌కో రెండు ప్రాజెక్టులను నామినేషన్ పద్ధతిలో చేపడుతుంది.