కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రశంస
నల్లగొండ, జనవరి 31 (విజయక్రాంతి) : కేతేపల్లి పీహెచ్సీ సిబ్బంది పనితీరు బాగుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అభినందించారు. శుక్రవారం కేతేపల్లి పీహెచ్సీని ఆమె తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్ తనిఖీ చేశారు. దవాఖానలో అందిస్తున్నసేవలను వైద్యాధికారి అర్చనను అడిగి తెలుసుకున్నారు.
వైద్య సేవలు, సాధారణ ప్రసవాలు, మాతా, శిశు సంరక్షణకు సిబ్బంది తీసుకుంటున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు. పీహెచ్సీ రహదారి వెంట లైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రసవాలకు సంబంధించి ఈడీడీ రిజిస్టర్ తప్పక నిర్వహించాలన్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, బరువు తూచే యంత్రాలు పరిశీలించారు.
ప్రజావాణి రద్దు..
వరంగల్- ఖమ్మం- నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసేంత వరకు ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల తరువాత యధావిధిగా ప్రజావాణి కొనసాగుతుందని వెల్లడించారు.