calender_icon.png 7 March, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంగంలోకి కేరళ జాగిలాలు

07-03-2025 12:15:23 AM

  1. కార్మికుల కోసం గాలింపు
  2.  ఫలించని జీపీఆర్ రాడార్ ప్రయత్నాలు
  3.  బురద తోడివేతకు అందుబాటులోకి కన్వేయర్ బెల్ట్

నాగర్‌కర్నూల్, మార్చి 6 (విజయక్రాంతి): శ్రీశైలం ఎడమగట్టు ఎస్‌ఎల్బీసీ సొరంగం 14వ కిలోమీటర్ వద్ద కుప్పకూలి 8 మంది కార్మికులు చిక్కుకున్న ఘటన జరిగి 12 రోజులు కావొస్తున్నా ఇప్పటికీ కార్మికుల జాడ కనిపించడం లేదు. సొరంగంలో కార్మికుల జాడను కనిపెట్టేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

నీటి ఊట, బురద, మట్టి దిబ్బలతో పాటు టీబీఎం శకలాలు కూడా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేరళకు చెందిన హ్యూమన్ రిమైన్స్ డిటెక్టన్ డాగ్స్ (మానవ అవశేషాల గుర్తింపులో ప్రత్యేకంగా శిక్షణ పొందిన జాగిలాలు) గురువారం ప్రత్యేక హెలికాప్టర్‌లో ఘటనా స్థలికి చేరుకున్నాయి. జాగిలాలకు శిక్షణ ఇచ్చిన హెల్పర్లను సొరంగంలోని ఘటనా స్థలానికి లోకో ట్రైన్ ద్వారా లోపలికి తీసుకెళ్లారు.

శుక్రవారం ఉదయం మరోసారి జాగిలాలతో పాటు లోపలికి వెళ్లి జీపీఆర్ రాడార్ సూచించిన ప్రదేశాలతో పాటు టీబీఎం మిషన్‌లోని భాగంలోనూ జల్లెడ పట్టే అవకాశం ఉన్నట్లు రెస్క్యూ టీం పేర్కొంది.  కాగా నిర్విరామంగా నీటి ఊట కారణంగా వాసన పసిగట్టే అవకాశం తక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. దేశ విదేశాల్లో అత్యంత ఆదరణ పొందిన 11 రకాల రెస్యూ బృందాలు కూడా సుమారు నాలుగు షిఫ్టులుగా నిర్విరామంగా పనిచేస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఎన్‌జీఆర్‌ఐ నిపుణులు జీపీఆర్ రాడార్ ద్వారా సూచించిన ప్రదేశాల్లోనూ రెస్క్యూ టీం బృందాలు తవ్వకాలు జరిపాయి. కానీ జీపీఆర్ రాడార్ ప్రయత్నాలు ఫలించలేదు. గురువారం కేంద్రం నుంచి మినిస్ట్రీ ఫర్ హోమ్ అఫైర్స్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సెక్రటరీ కర్నల్ కీర్తి ప్రతాప్‌సింగ్ సహాయక చర్యలను పరిశీలించారు. టన్నెల్‌లోని 13.600 కిలోమీటర్ వద్ద టీబీఎం మిషన్‌పై మట్టితో పాటు రాళ్లు కూడా పడ్డాయని, దీంతో మిషన్ పూర్తిగా ధ్వంసమైనట్లు గుర్తించామని వెల్లడించారు.

కాగా 8 మంది కార్మికులు అక్కడే ఉండి ఉంటారని అనుమానిస్తున్నామన్నారు. దాదాపు కార్మికులు మృతి చెంది ఉంటారని ప్రాథమిక నిర్ధారణకు వచ్చాకే సుమారు 15 ఫీట్ల భూమి పొరల్లో మానవ అవశేషాలు దుర్వాసనను పసిగట్టగలిగే జాగిలాలను రప్పించినట్టు తెలుస్తోంది. 

మళ్లీ అందుబాటులోకి  కన్వేయర్ బెల్ట్

మట్టి, బురదను టన్నెల్ నుంచి బయటికి తీసుకొచ్చేందుకు ప్రధాన వనరుగా ఉన్న కన్వేయర్ బెల్ట్ 13వ కిలోమీటర్ వద్ద ధ్వంసమైంది. దీంతోపాటు పేరుకుపోయిన బురద కారణంగా లోకో ట్రైన్ 12వ కిలోమీటర్ వరకే అందుబాటులోకి రావడంతో టన్నెల్‌లోని శకలాలు, బురదను బయటకి తేలేని పరిస్థితి నెలకొంది.

దీంతో 13 రోజులుగా సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురయ్యాయి. మంగళవారం రెండు గంటలు పనిచేసిన బెల్ట్ తర్వాత నిలిపేశారు. దాన్ని తిరిగి గురువారం ప్రారంభించడంతో బురద తోడివేత పనులు ముందుకు సాగుతున్నాయి. ప్రతీ నిమిషానికి సుమారు 6 వేల లీటర్ల నీటి ఊట కూడా వచ్చి చేరుతుండగా డీవాటరింగ్ ప్రక్రియను కూడా వేగిరం చేశారు.