calender_icon.png 25 September, 2024 | 12:01 PM

తిరుమల లడ్డూ కల్తీపై కేంద్రం నజర్

21-09-2024 02:11:57 AM

ఏపీ ప్రభుత్వాన్ని సమగ్ర నివేదిక కోరిన కేంద్రమంత్రి నడ్డా

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయి సమీక్ష

తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో పంది, గొడ్డు, చేపల కొవ్వులు కలిపినట్లు వస్తోన్న ఆరోపణలపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఈ విషయంలో సమగ్ర నివేదిక అందించాలని ఏపీ సీఎం చంద్రబాబును కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా కోరారు. నివేదిక పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని నడ్డా స్పష్టం చేశారు. లడ్డూ తయారీలో నాసికరం వస్తువులతో పాటు జంతువుల కొవ్వును ఉపయోగించడం తీవ్రమైన విషయమని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ఏపీ సచివాలయంలో శుక్రవారం సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీలో జరిగిన తప్పిదాలు, అపవిత్ర కార్యకలాపాల గురించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకుని భక్తుల విశ్వాసాలు కాపాడుతామని స్పష్టం చేశారు.  

లడ్డూ కల్తీపై కేంద్రం ఫోకస్

  1. ఏపీ ప్రభుత్వాన్ని సమగ్ర నివేదిక కోరిన కేంద్రమంత్రి నడ్డా
  2. ల్యాబ్ రిపోర్టులు సైతం పంపించాలని సూచన
  3. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం
  4. బాధ్యులను శిక్షించి భక్తుల విశ్వాసాలు కాపాడుతాం
  5. అన్ని వర్గాలతో చర్చించి ఏం చేయాలో నిర్ణయిస్తాం
  6. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
  7. సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి: పవన్
  8. ప్రజల విశ్వాసాన్ని కూల్చే కుట్ర
  9. ఈ అంశంపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలి
  10. ఏపీ సీఎంకు కేంద్రమంత్రి బండి సంజయ్ లేఖ
  11. స్వచ్ఛమైన ఆవు నెయ్యి రూ.400కు ఎలా దొరుకుతుంది?
  12. టీటీడీ ఈవో శ్యామలారావు ప్రశ్న
  13. దేవుని పేరుతో రాజకీయాలు చేస్తున్నారు
  14. ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నమే ఇది: మాజీ సీఎం జగన్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై వస్తోన్న ఆరోపణలపై కేంద్రం తీవ్రస్థాయిలో స్పందించింది. లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో పంది, గొడ్డు, చేపల కొవ్వులు కలిపినట్లు వస్తోన్న ఆరోపణలను కేంద్ర ప్రభుత్వంగా తీవ్రంగా పరిగణిస్తోంది. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదిక అందజేయాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా కోరారు.

నేను చంద్రబాబుతో మాట్లాడాను. వారి వద్ద ఉన్న పూర్తి సమాచారాన్ని పంపాలని చెప్పా. ల్యాబ్ రిపోర్ట్‌ను పంపించాలని సూచించాను. దాని ప్రకారం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. దీనిపై ఇప్పటికే రిపోర్ట్ ఇవ్వాలని కోరాం అని నడ్డా వివరించారు. 

తీవ్రమైన విషయం: ప్రహ్లాద్ జోషీ

లడ్డూ తయారీలో నాసిరకం వస్తువులతో పాటు జంతువుల కొవ్వు వినియోగించడంపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ స్పందించారు. ఢిల్లీలో గ్లోబర్ ఫుడ్ రెగ్యులేటరీస్ సమ్మిట్‌కు హాజరైన ఆయన.. ఈ అంశంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఏపీ సీఎం చెప్పినట్లు ఇది చాలా తీవ్రమైన విషయమని, అందరినీ ఆందోళనకు గురిచేసే అంశమని పేర్కొన్నారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బీజేపీ సీనియర్ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పందిస్తూ.. ఇది ప్రజల విశ్వాసంపై నేరుగా జరిగిన దాడి అని పేర్కొన్నారు. ఇది భక్తుల నమ్మకాన్ని వమ్ము చేయడమేనని, పక్కా ప్రణాళికతో జరిగిన కుట్ర అని ఆరోపించారు. వ్యాపార ప్రయోజనాల కోసం కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. ఇది ఏమాత్రం క్షమించరాని నేరమని వ్యాఖ్యానించారు.    

సనాతన ధర్మరక్షణ బోర్డు

టీటీడీ సమస్యలను పరిష్కరించేందుకు సనాతన ధర్మ రక్షణ బోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరముందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. ఇది జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. తిరుమలలో కల్తీ నెయ్యి వినియోగంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగం అందరి మనోభావాలను దెబ్బతీసిందన్నారు. కల్తీ నెయ్యి విషయంలో తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు. వైసీపీ హయాంలో ఉన్న టీటీడీ బోర్డు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.   

రాజకీయ వివాదం

తిరుపతి లడ్డూల విషయం ఏపీలో రాజకీయ వివాదానికి దారితీసింది. రాజకీయ ప్రయోజనాల కోసమే హీనమైన ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నాయకులు టీడీపీ ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నారు.  ల్యాబ్ రిపోర్టులను ప్రచారం చేస్తూ ఆరోపణలను సమర్థించుకుంటున్నారని మండిపడ్డారు. కాగా, ఈ వివాదంపై పలువురు కేంద్రమంత్రులు సైతం స్పందించారు. తిరుమలపై జగన్ ప్రభుత్వం కావాలనే మత వ్యతిరేక చర్యలకు పాల్పడిందని కేంద్రమంత్రి శోభాకరంద్లాజే ఆరోపించారు. తిరుమలలోని కాలేజీల్లో శ్రీవారి ఫొటోలను తొలగించాలని, హిందూయేతర గుర్తులను ఏడుకొండలపై ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం చూసిందని మండిపడ్డారు. టీటీడీకి హిందుయేతరులను బోర్డు చైర్మన్‌గా నియమించారని, ప్రసాదంలో జంతువుల కొవ్వును కలిపారని ధ్వజమెత్తారు. 

ఆ ధరకు నెయ్యి ఎలా అమ్ముతారు? 

లడ్డూ నాణ్యతపై పోటు (తిరుమలలో లడ్డూ తయారీ కేంద్రం) సిబ్బంది కూడా అసంతృప్తి వ్యక్తం చేశారని టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు. లడ్డూ రుచి నెయ్యి నాణ్యతపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. కొంతకాలంగా లడ్డూ నాణ్యతపై ఫిర్యాదులు వస్తున్నాయని వెల్లడించారు. ఇప్పటికే సరఫరాదారులకు నెయ్యి నాసిరకంగా ఉందని చెప్పినట్లు  తెలియజేశారు. అయితే నెయ్యి నాణ్యత నిర్ధారణకు టీటీడీలో సొంత ప్రయోగశాల లేదని, గతంలో ఎప్పుడూ నెయ్యి నాణ్యతపై పరీక్షలు నిర్వహించిన దాఖలాలు లేవని చెప్పారు. నెయ్యి నాణ్యత నిర్ధారణకు బయట ల్యాబ్స్‌పై ఆధారపడుతున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో రూ.411కే కిలో నెయ్యి సరఫరా చేశారు. నాణ్యమైన నెయ్యిని అంత తక్కువ ధరకు ఎవరూ సరఫరా చేయలేరు. మేం హెచ్చరించిన తర్వాత కాంట్రాక్టర్లు నాణ్యత పెంచారు అని శ్యామలారావు తెలిపారు. 

జంతువుల కొవ్వు ఉన్నట్లు నిర్ధారణ

టీటీడీకి సరఫరా అవుతోన్న నాలుగు ట్యాంకర్లలోని నెయ్యి శాంపిళ్లలను జూలై 6న 10 ప్రయోగశాలలకు పంపించినట్లు శ్యామలారావు వెల్లడించారు. గుజరాత్ ఆనంద్‌లోని ప్రసిద్ధి చెందిన ఎన్‌డీడీబీ ల్యాబ్.. ఈ నెయ్యిలో నాణ్యత లేదని, భారీగా కల్తీ జరిగినట్లు నివేదిక ఇచ్చినట్లు చెప్పారు. వారంలో ల్యాబ్ నివేదికలు రెండు విభాగాలుగా వచ్చాయని, నెయ్యి నాణ్యత 100కు బదులుగా 20 పాయింట్లే ఉందని తెలిపారు. జంతువుల కొవ్వు కూడా నెయ్యిలో కలిసినట్లు ఎన్‌డీడీబీ తేల్చిందని వివరించారు.

పంది, చేప, గొడ్డు కొవ్వులను నెయ్యి తయారీలో ఉపయోగించారని గుర్తించినట్లు చెప్పారు. ప్రస్తుతం టీటీడీకి తమిళనాడుకు చెందిన ఏఆర్ ఫుడ్స్ నెయ్యిని సరఫరా చేస్తోంది. ఇందులో కల్తీ జరిగిందని తెలిపిందన్నారు. నివేదిక వచ్చిన వెంటనే చర్యలకు ఉపక్రమించామని, దీనిపై ఓ కమిటీ వేసినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమలలో నెయ్యి కల్తీ పరీక్ష కోసం శాంపిళ్లను బయటకి పంపడం ఇదే తొలిసారని శ్యామలారావు చెప్పారు.  

బ్రాండ్ మారిందా?

తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీపై సీఎం చంద్రబాబు ఆరోపణలతో సరఫరాదారులపై దృష్టి పడింది. టీటీడీ ప్రతి ఆరు నెలలకోసారి నెయ్యి సరఫరాకు టెండర్లు పిలిచి ఏటా 5 లక్షల కిలోల నెయ్యిని కొనుగోలు చేస్తుంది. 15 ఏళ్లుగా తిరుమలకు కర్ణాటకకు చెందిన నందిని బ్రాండ్ నెయ్యిని సరఫరా చేస్తూ వస్తోంది. గతేడాది జగన్ ప్రభుత్వంలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ సూచనల మేరకు ధరలు పెరిగాయి. టెండర్లలో ఫెడరేషన్ నిర్ణయాలకు అనుగుణంగా నందిని బ్రాండ్ బిడ్డింగ్ వేసింది.

దీంతో తక్కువ ధరకు వేసిన బిడ్డర్‌కు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది. గతంలో ఈ విషయంపై రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ వివాదం కూడా నడిచింది. టెండర్లలో వివక్షపూరిత విధానాలు పాటించారని కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమానాయక్ ఆరోపించారు. ఇకపై లడ్డూ నాణ్యత ఇంతకుముందు ఉన్నట్లు ఉందని చెప్పారు. దీనిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా స్పందించారు. కాగా, టీటీడీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తగదని బీజేపీ ఆరోపించింది. కాగా, టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఆగస్టు నుంచి మళ్లీ తిరుమలకు నందిని నెయ్యి సరఫరా జరుగుతోంది.   

మాపై విష ప్రచారం తగదు: ఏఆర్ డెయిరీ

దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ వివాదం చర్చనీయాంశం కాగా తయారీలో వినియోగించే నెయ్యిని అందించే తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ స్పందించింది. తిరుమలకు జూన్, జూలైలో నెయ్యిని సరఫరా చేశాం. ఇప్పుడు మా సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా చేయడంలేదు. 25 ఏళ్లుగా మా సంస్థ డెయిరీ సేవలు అందిస్తోంది. దేశవ్యాప్తంగా మా ఉత్పత్తుల అమ్మకాలు జరుగుతున్నాయి. ఎప్పుడూ ఇలాంటి ఆరోపణలు రాలేదు. ప్రస్తుత ఆరోపణల నేపథ్యంలో నెయ్యి నాణ్యత ప్రమాణాలపై పరీక్షలు నిర్వహించాం. అందులో ఎలాంటి లోపాలు లేవని తేలింది. కానీ మాపై విష ప్రచారం చేస్తున్నారు. టీటీడీ అడిగిన వెంటనే సంబంధించిన రిపోర్టులు పంపాం. కానీ వారి నుంచి మాకు స్పందన రాలేదు అని ఏఆర్ డెయిరీ యాజమాన్యం తెలిపింది. 

భక్తుల విశ్వాసాలు కాపాడుతాం

నడ్డా ఆదేశాల నేపథ్యంలో తిరుపతి లడ్డూ తయారీలో నాణ్యతా లోపాలు, ఇతర పదార్థాల వాడకంపై సీఎం చంద్రబాబు సెక్రటేరియట్‌లో శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీలో జరిగిన తప్పిదాలు, అపవిత్ర కార్యకలాపాల గురించి శుక్రవారం సాయంత్రంలోపు సమగ్ర నివేదిక అందివ్వాలని టీటీడీ ఈవోకు స్పష్టం చేశారు. తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో ఆగమ, వైదిక ధార్మిక పరిషత్‌లతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించారు. భక్తుల విశ్వాసాలు, సంప్రదాయాలు కాపాడుతామని వెల్లడించారు. జగన్ ప్రభుత్వంలో తిరుపతి లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును వాడారని చంద్రబాబు గతంలో ఆరోపించారు. 

విశ్వాసాన్ని కూల్చే కుట్ర: బండి

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇది క్షమించరాని నేరమని, ఈ విషయంలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబుకు సంజయ్ లేఖ రాశారు. ఈ వ్యవహారం యావత్ ప్రపంచంలోని హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. తిరుమలను అపవిత్రం చేశారని, అక్కడ అన్యమత ప్రచారం జరుగుతోందని ఫిర్యాదులు వచ్చినా అప్పటి పాలకులు పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగం అత్యంత నీచమని, దీన్ని హిందూ ధర్మంపై జరిగిన భారీ కుట్రగా భావిస్తున్నామని మండిపడ్డారు.

తిరుపతి లడ్డూ ప్రాముఖ్యాన్ని తగ్గించడం, కోట్ల మంది భక్తుల విశ్వాసాన్ని సడలించేందుకు  ఈ కుట్ర చేశారని, క్షమించరాని నేరానికి పాల్పడ్డారని సంజయ్ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. శ్రీవారి లడ్డూలో నాసిరకం నెయ్యి వాడారని, పంది, చేప కొవ్వును ఉపయోగించినట్లు తేలిందని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు అన్నారు. నెయ్యి కాంట్రాక్టును కొత్తవారికి ఎందుకు అప్పగించారని ప్రశ్నించారు. దీనిపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం ఇంత దారుణానికి ఒడిగడుతుందని అనుకోలేదని వీహెచ్ అన్నా రు. కల్తీ నెయ్యి వాడిన వాళ్లను దేవుడు సైతం క్షమించడని పేర్కొన్నారు. 

మహాపాపం: రమణ దీక్షితులు

శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వాడకంపై టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుమలలో ప్రసాదాల నాణ్యతపై గతంలో ఎన్నోసార్లు టీటీడీ చైర్మన్, ఈవో దృష్టికి తీసుకెళ్లిన లాభం లేకపోయిందన్నారు. వ్యక్తిగత కారణాలతో తోటి అర్చకులెవరూ నాతో కలిసి రాలేదని, దీంతో తాను ఒంటిరి పోరాటం చేశానని చెప్పారు. గత ఐదేళ్ల పాటు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. నెయ్యి పరీక్షలకు సంబంధించిన ల్యాబ్ రిపోర్టుల్లో జంతువుల కొవ్వు ఉన్నట్లు తేలిందని చెప్పారు. పరిశుభ్రమైన ఆవు పాలతో తయారైన నెయ్యిలో కొవ్వు పదార్థాలు కలిసే వీలులేదని, పవిత్రమైన ఆవు నెయ్యిని కల్తీ చేసి ప్రసాదాల్లో ఉపయోగించడం అపచారమని చెప్పారు. మళ్లీ నందిని డెయిరీ నుంచి నెయ్యిని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామని రమణ దీక్షితులు వెల్లడించారు.  

దేవుని పేరుతో రాజకీయాలు: జగన్

తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ మాజీ సీఎం జగన్ మొదటిసారి మౌనం వీడారు. నెయ్యిలో పంది, గొడ్డు, చేపల నూనెలు వాడినట్లు వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు చంద్రబాబు ఆడుతోన్న నాటకమని, దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. లడ్డూలలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు తేలిన ల్యాబ్ నివేదిక సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన జూలై నాటిదని తెలిపారు.

నెయ్యి నాణ్యత తక్కువగా ఉన్న సమాచారం మాకు వచ్చిన వెంటనే సీఎంకు సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్టర్ల ఎంపికలో సాధారణ ప్రోటోకాల్‌ను అనుసరించామని స్పష్టం చేశారు. ఎన్‌ఏబీఎల్, ఉత్పత్తి నాణ్యత సర్టిఫికెట్ ఉంటేనే సరఫరాదారులకు అవకాశం ఉంటుంది. టీటీడీ ఎప్పటికప్పుడు నెయ్యి నుంచి నమూనాలను సేకరిస్తుంది. ధ్రువీకరణ పొందిన ఉత్పత్తులనే వాడుతుంది. కానీ ఈ విషయంలో టీడీపీ రాజకీయం చేస్తోంది. ఇలాంటి మతపరమైన ఆరోపణలను ఇప్పటికే మేం చాలాసార్లు తిరస్కరించాం. మా ప్రభుత్వ పాలనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇదంతా అనవసరం అని పేర్కొన్నారు.