మాజీ సీఎం భద్రతపై పార్టీ నేతల ఆందోళన
ఢిల్లీ, సెప్టెంబర్ 18: ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అధికార నివాసాన్ని ఖాళీ చేయనున్నారు. నివాసంతో పాటు అన్ని రకాల సౌకర్యాలను వదులుకునేందుకు కేజ్రీవాల్ సిద్ధమయ్యారని ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ పేర్కొన్నారు. దీంతో కేజ్రీవాల్ భద్రతపై ఆప్ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై కేజ్రీవాల్ అరెస్టు కాగా, ఇటీవల తిహాడ్ జైలు నుంచి విడుదలైన వెంటనే ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేస్తారని ప్రకటించారు. దీంతో ఆప్ నేతలంతా కలిసి మంత్రిగా ఆతిశీని సీఎంగా ఎన్నుకున్నారు.
ఈ క్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు కేజ్రీవాల్ తన రాజీనామా లేఖను అందించారు. పదవి నుంచి తప్పుకోవడంతో అధికార నివాసాన్ని ఖాళీ చేయనున్నారు. ఈ సందర్భంగా ఎంపీ సంజయ్‌సింగ్ మాట్లాడుతూ.. “వారంలో కేజ్రీవాల్ అధికార నివాసాన్ని ఖాళీ చేయనున్నారు. కొత్త ఇంటి కోసం ఆయన కుటుంబ సభ్యులు అన్వేషిస్తున్నారు. కేజ్రీవాల్ ప్రజల నేత. ఆయన ఢిల్లీవాసులతో కలిసి జీవించాలనుకుంటున్నారు. ప్రస్తుతం నివాసంలో సరైన భద్రత ఉంది. కానీ కేజ్రీవాల్ ఆ ఇంటి నుంచి బయటకు రాబోతున్నారు. ఆయన భద్రతపై మేమంతా ఆందోళన చెందుతున్నాం” అని పేర్కొన్నారు. కేంద్రంలోని మోదీ సర్కార్‌పై ఆప్ నేతలు విమర్శలు సంధిస్తున్నారు. ‘కేజ్రీవాల్ రాజీనామాపై ఢిల్లీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.