calender_icon.png 23 September, 2024 | 3:53 AM

కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి

23-09-2024 01:39:20 AM

కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ విధానాలపై సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్‌ను ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ 5 ప్రశ్నలు వేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కోట్లాది రూపాయల మద్యం కుంభకోణంలో జైలుకు వెళ్లిన కేజ్రీవాల్ ఏ మాత్రం నైతిక విలువలు లేని వ్యక్తి అని ఆరోపించారు. ప్రజారోగ్యం విషయంలోనూ ప్రజలను దోచుకునాలనుకునే కేజ్రీవాల్‌కు బీజేపీని, ఆర్‌ఎస్‌ఎస్‌ను నిందించే అర్హత లేదన్నారు. కేజ్రీవాల్‌ను నమ్మి అనేకసార్లు ఆయనకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిన ఢిల్లీ ప్రజల జీవితాల్లో సానుకూల మా ర్పులు తీసుకురానందుకు ముందు గా వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కాగా.. ఆదివారం అరవింద్ కేజ్రీవాల్ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌ను 5 ప్రశ్నలు వేశారు. బీజేపీ విధానాలు, బీజేపీ సంబంధాలను ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షాలను చీల్చి అవినీతి నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీపై ఆర్‌ఎస్‌ఎస్ పట్టు కోల్పోతోందని.. అందుకే రిటైర్మెంట్ నిబంధన ప్రధాని మోదీకి వర్తించడం లేదా అని ప్రశ్నించారు.