- షరతులతో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
- సీబీఐ తీరుపై ధర్మాసనం మండిపాటు
- దేవుడు నాకు తోడుగా ఉన్నాడు
- దేశ విభజన శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతా
- విడుదల తర్వాత కేజ్రీవాల్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సీబీఐ నమోదు చేసిన కేసులో సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ శుక్రవారం తీర్పునిచ్చింది. దీంతో అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని కొన్ని గంటల వ్యవధిలోనే తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్ విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో వర్షం కురుస్తున్నా జైలు వద్దకు నేతలు, అభిమానులు ఆయనకు స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో చేరుకున్నారు.
100 రెట్లు బలపడ్డా..
ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఇంత భారీ వర్షంలో నన్ను చూసేందుకు మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. దేశానికి నా జీవితం అంకితం చేశాను. నా జీవితంలో ఎన్నో కష్టాలు, అడ్డంకులను చూశాను. సత్యమార్గంలో నడిచినం దుకే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నా మనోధైర్యాన్ని దెబ్బ తీసేందుకు వాళ్లు (బీజేపీ) నన్ను జైలులో పెట్టారు. జైలు నుంచి వచ్చాక 100 రెట్లు బలపడ్డా.
దేవుడు చూపిన మార్గంలో నడుస్తూ దేశానికి సేవ చేస్తూనే ఉంటా. దేశ విచ్ఛిన్న శక్తులపై పోరాటం చేస్తా అని చెప్పారు. కేజ్రీవాల్‌కు స్వాగతం పలికేందుకు జైలు వద్దకు వచ్చినవారిలో ఆయన సతీమణి సునిత, పంజాబ్ సీఎం భగవత్‌మాన్, ఢిల్లీ మంత్రి అతిశీ, మాజీ మంత్రి మనీశ్ సిసోడియా ఉన్నారు.
పంజరంలో చిలుక
మద్యం పాలసీ కేసుకు సంబంధించి సీబీఐ తన అరెస్టును సవాలు చేయడంతో పాటు బెయిల్ అభ్యర్థిస్తూ రెండు వేర్వేరు పిటిషన్లను కేజ్రీవాల్ దాఖలు చేశారు. వీటిపై విచారించిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం.. శుక్రవారం తీర్పును వెల్లడించింది. ఈ సందర్భ ంగా బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ సరైనదే అయినా సుదీర్ఘంగా నిర్బంధించడం హక్కులను హరి ంచడమే అవుతుంది. ఈడీ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే సీబీఐ అరెస్ట్ ఎంతమాత్రం సరికాదు. ఇదొక వ్యూహాత్మక చర్య.
ప్రతి వ్యక్తికీ బెయిల్ నిబంధన, జైలు అనేది మినహాయింపు మాత్రమే అని జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. సీబీఐ పం జరంలో చిలుకగా ఉంది. ఇది నిజం కాదని నిరూపించుకోవాలి. ఈడీ అరెస్ట్‌పై స్టే తర్వాతనే సీబీఐ ఎందుకు అరెస్టు చేయాల్సివ చ్చింది? 22 నెలలుగా మౌనంగా ఉన్న సీబీఐ వెంటనే ఎందుకు స్పందించింది? అని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మండిపడ్డారు.
బీజేపీ, కాంగ్రెస్ విమర్శలు
కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు షరతులతో బెయిల్ ఇచ్చిందని, దీంతో జైల్ వాలా సీఎంగా ఉన్న కేజ్రీవాల్ బెయిల్ వాలా సీఎంగా మారారని ఎద్దేవా చేసింది. నైతికత ఉంటే జైలుకు వెళ్లాక పదవికి రాజీనామా చేసేవారని పేర్కొంది. కేజ్రీవాల్‌పై కాంగ్రెస్ పార్టీ సైతం విమర్శలు గుప్పించింది. కేజ్రీవాల్‌కు సుప్రీం బెయిల్ మాత్రమే ఇచ్చిందని, క్లీన్ చిట్ ఇవ్వలేదని పేర్కొంది.
ఆర్నెల్లుగా జైలులో
ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఈ ఏడాది మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా జూలైలో బెయిల్ మంజూరు అయింది. ఈడీ కేసులో బెయిల్ రాగానే సీబీఐ అరెస్ట్ చేసింది. దీంతో కేజ్రీవాల్ తీహార్ జైలులోనే ఉండాల్సి వచ్చింది.
బెయిల్ షరతులివే
- రూ.10 లక్షల పూచీకత్తు
- ఇద్దరి ష్యూరిటీలు
- ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లేందుకు అనుమతి లేదు
- అధికారిక సంతకాలు చేయడానికి వీలులేదు
- కేసు గురించి బహిరంగంగా మాట్లాడకూడదు
నిజం ఎప్పుడూ ఓడిపోదు: ఆప్
కేజ్రీవాల్‌కు బెయిల్ రావడంతో ఆప్ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా సత్యమేవజయతే అనే ట్యాగ్‌లైన్‌ను ట్రెండింగ్ చేశారు. సమస్యలు ఎన్ని ఎదురైనా నిజం ఎప్పుడూ ఓడిపోదని ఆప్ కీలక నేత అతిశీ వ్యాఖ్యానించారు. అబద్ధాలు, కుట్రలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో సత్యం మళ్లీ గెలిచిందని మనీశ్ సిసోడియా ఉద్ఘాటించారు. ఆయనలాంటి నిజాయతీపరుడు, దేశభక్తుడు మరొకరు లేరని కొనియాడారు.
ఇంతకాలం దృఢ వైఖరి ప్రదర్శించిన ఆప్ కుటుంబానికి కేజ్రీవాల్ భార్య సునిత ధన్యవా దాలు తెలిపారు. కేజ్రీవాల్ విడుదలతో ఆప్‌కు మరింత బలం చేకూరిందని ఎంపీ రాఘవ్ చడ్డా అన్నా రు. దేశవ్యాప్తంగా సంతోషం కనిపిస్తోందని అన్నారు. హర్యానా ఎన్నికల ప్రచారంలో పార్టీకి కేజ్రీవాల్ నాయకత్వం వహిస్తారని స్పష్టం చేశారు.