calender_icon.png 12 January, 2025 | 9:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేజ్రీవాల్ మైండ్‌గేమ్

26-12-2024 12:00:00 AM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రధాన ప్రత్యర్థులయిన ఆప్, బీజేపీల మధ్య అప్పుడే మైండ్‌గేమ్ మొదలైంది. వచ్చే ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు జనవరి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడవచ్చని  భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన ఆప్, కాంగ్రెస్‌లు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం విడివిడిగా పోటీ చేయాలని నిర్ణయించాయి. లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు రెండు పార్ట్టీలకు ఏమాత్రం కలిసి రాకపోవడమే దీనికి కారణం.

అందుకే కేజ్రీవాల్ అసెంబ్లీ ఎన్నికలకు తమ పార్టీ అభ్యర్థుల జాబితాను అందరికంటే ముందుగా ప్రకటించి ప్రచార బరిలోకి సైతం దిగిపోయారు. ఈ నేపథ్యంలోనే తాము తిరిగి అధికారంలోకి వస్తే ‘మహిళా సమ్మాన్ యోజన’ కింద మహిళలందరికీ ప్రతినెలా రూ.2,100 ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. అలాగే ‘సంజీవని యోజన’ కింద సీనియర్ సిటిజన్లు అందరికీ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ పథకాలకు సంబంధించిన దరఖాస్తులను ఆప్ ఇప్పటికే స్వీకరించడం మొదలు పెట్టింది. అయితే ఈ పథకాలకు సంబంధించి ఢిల్లీ వాసులను హెచ్చరిస్తూ వార్తా పత్రికల్లో వచ్చిన ఓ ప్రకటన ఇప్పుడు వివాదాస్పదం అయింది. ఈ పథకాలకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని, వీటికి సంబంధించిన డేటాను సేకరించే అధికారం ఎవరికీ ఇవ్వలేదంటూ సంబంధిత మంత్రిత్వ శాఖలు ఆ ప్రకటనలో పేర్కొన్నాయి.

దీనిపై స్పందించిన కేజ్రీవాల్ ఆప్ తీసుకొచ్చిన కొత్త పథకాలు కొందరికి  నచ్చడం లేదని, అందుకే వీటిని అడ్డుకోవడానికి తప్పుడు కేసులో ముఖ్యమంత్రి ఆతిశిని ఎన్నికల లోపే అరెస్టు చేస్తారంటూ పరోక్షంగా బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. అంతకన్నా ముందు ఆప్ సీనియర్ నాయకులు ఇళ్లలో  సోదాలు జరుగుతాయని కూడా ఆరోపించారు. కేజ్రీవాల్ ఆరోపణలు తమ ప్రధాన ప్రత్యర్థి అయిన బిజెపిపై ఆడబోయే ‘మైండ్‌గేమ్’లో భాగంగానే భావించాలి. ఎందుకంటే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ప్రధాన ప్రత్యర్థి బీజేపీయేనని ఆయనకు స్పష్టంగా తెలుసు. కాంగ్రెస్‌ను ఆయన పట్టించుకోవడమేలేదు.

మరోవైపు కేజ్రీవాల్ పోటీ చేస్తున్న న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ మాజీ ఎంపీ పర్వేష్ వర్మ మహిళా ఓటర్లకు రూ.1100 చొప్పున నగదు పంపిణీ  చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని ముఖ్యమంత్రి ఆతిశి మరో తీవ్ర ఆరోపణ చేశారు. బీజేపీ వాళ్లు బహిరంగంగా ఓట్లు కొంటున్నారని తాను వెళ్లిన ప్రతి చోటా జనాలు తనకు చెప్పారని, అయితే తాము డబ్బు తీసుకున్నా వాళ్లకు ఓటేయమని కూడా వాళ్లు స్పష్టంగా చెప్పారని కేజ్రీవాల్ సైతం అంతకుముందు చెప్పడం గమనార్హం.

పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ చేస్తున్నా ఈడీ ఎందుకు దాడులు చేయడం లేదని కూడా ఆప్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే తన తండ్రి ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ తరఫున తాను ఆ డబ్బు పంపిణీ చేసినట్లు పర్వేష్ వర్మ చెప్పారు. కేజ్రీవాల్‌లాగా తాను మద్యం పంపిణీ చేయనందుకు సంతోషిస్తున్నానని ఆయన ఎదురుదాడి చేశారు.లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఆదరిస్తున్న ఢిల్లీ ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీకి పట్టం కట్టకపోవడం గమనార్హం.

ఈ నేపథ్యంలో ఈ సారి ఎలాగైనా ఢిల్లీ అసెంబ్లీలో పాగా వేయాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. దానికి తగ్గట్టుగానే కేజ్రీవాల్ హయాంలో జరిగిన అవినీతి ప్రధాన అస్త్రంగా వ్యూహాలకు పదును పెడుతోంది కూడా. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ కమలం పార్టీపై ముందునుంచే ఎదురుదాడికి దిగడం ద్వారా ఆ పార్టీని ఇబ్బంది పెట్టే యోచన చేస్తున్నట్లు తాజా ఆరోపణల పర్వాన్ని బట్టి అర్థమవుతోంది.  రాబోయే రోజుల్లో ఈ రెండు పార్టీల మధ్య ఇలాంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు మరిన్నిచూస్తామేమో!