calender_icon.png 24 December, 2024 | 6:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు షాక్

22-12-2024 02:00:39 AM

* ఈడీ దర్యాప్తుకు ఎల్జీ అనుమతి

* మద్యం పాలసీలో అవినీతి జరిగిందన్న ఈడీ

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఢిల్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ కుంభకోణంలో ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనా అనుమతులు మంజూరు చేశారు. ఈ మేరకు ఎల్జీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.  

పబ్లిక్ సర్వెంట్ల విచారణకు ముందస్తు అనుమతి..

సీఆర్పీసీ ప్రకారం మనీలాండరింగ్ కేసులో పబ్లిక్ సర్వెంట్లను విచారించేందుకు ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. లిక్కర్ మనీ లాండరింగ్ కేసులో విచారించేందుకు డిసెంబర్ 5న పీఎంఎల్‌ఏ చట్టం కింద ప్రాసిక్యూషన్ చేయడానికి ఎల్జీని ఈడీ అనుమతి కోరింది. లిక్కర్ పాలసీని రూపొందించడంలో, అమలు చేయడం లో భారీ స్థాయిలో అవినీతి జరిగినట్లు గుర్తించామని ఎల్జీకీ ఈడీ లెటర్ రాసింది. 

మార్చి 21న కేజ్రీ అరెస్ట్..

 ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈ ఏడాది మార్చి 21న కేజ్రీని ఈడీ అరెస్ట్ చేసింది. మే 10 నుంచి జూన్ 1 వరకు ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరైంది. జూన్ 2న ఆయన తీహార్ జైలులో లొంగిపోయారు. సెప్టెంబర్ 14న ఆయన తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులోనే మరోసారి కేజ్రీవాల్ ను విచారించేందుకు ఈడీ సిద్ధమవుతోంది. 

దళిత విద్యార్థుల కోసం అంబేద్కర్ స్కాలర్‌షిప్..

బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో దేశంలో రాజకీయ దుమారం రేగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్  కొత్త ఎన్నికల హామీని ప్రకటించారు. దళిత విద్యార్థుల కోసం ‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సమ్మాన్ స్కాలర్‌షిప్’ స్కీంను ఢిల్లీలో అమలు చేస్తామని శనివారం ఆయన వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో  మాట్లాడుతూ పార్లమెంట్‌లోనే అంబేద్కర్‌కు వ్యతిరేకంగా ఒక ఎంపీ ఇలా మాట్లాడుతారని ఎవరూ ఊహించి ఉండరని, అమిత్ షా చేసిన వ్యాఖ్యలు చాలా తప్పు అని  మండిపడ్డారు.