28-04-2025 02:30:19 AM
కేసీఆర్ తన ప్రసంగాన్ని ‘జననీ జన్మభూమిచ్చ స్వర్గదపి గరీయసీ..’ అంటూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన ఉద్యమాన్ని, తెలంగాణ సాధన అనంతరం పదేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. తొలుత ప్రసంగంలో నిశబ్దంగా కేసీఆర్ ప్రసంగాన్ని విన్న కార్యకర్తలు తదుపరి కాంగ్రెస్‌పై విరుచుకుపడుతూ చేసిన ప్రసంగానికి ఈలలు, చప్పట్లతో స్పందించారు.
కాంగ్రెస్‌తో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ పదకొండు నెలల పాలనలో పదకొండు రూపాయలు కూడా ఇవ్వలేదని పేర్కొంటూ, ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల ఏపీలో కలిపారని, తెలంగాణపై పార్లమెంట్‌లో మోదీ చేసిన ప్రసంగాన్ని ఎండగడుతూ మాట్లాడిన సందర్భంలో కూడా స్పందన లభించింది. ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కాగార్’తో గిరిజనులు, యువకులు మృత్యువాత పడుతున్నారని, నక్సలైట్లు చర్చలకు సిద్ధమన్న సందర్భాన్ని పురస్కరించుకొని వారితో చర్చలు జరపాలని బీఆర్‌ఎస్ పార్టీ తరపున ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేసిన సందర్భంలో కార్యకర్తల నుంచి స్పందన లభించింది.
బీఆర్‌ఎస్ సోషల్ మీడియా వారియర్స్‌పై పోలీసులు కేసులు పెడుతున్న తీరుపై మండిపడ్డారు. తాము చట్టానికి లోబడి ఉంటామని పోలీసులు కేసులు పెట్టే విషయంలో ఆలోచించాలని, సోషల్ మీడియా వారియర్స్ భయపడవద్దని, మీకు అండగా బీఆర్‌ఎస్ లీగల్ టీమ్ ఉంటుందని పేర్కొనడంతో సోషల్ మీడియా వారియర్స్ చప్పట్లతో జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాదిన్నర పాలన, వైఫల్యాలు, తెలంగాణకు నెహ్రూ, ఇందిరాగాంధీ కాలం నుంచి దగా చేశారంటూ.. కార్యకర్తలను ఉత్తేజపరిచే ప్రయత్నం కేసీఆర్ చేశారు.
కేసీఆర్ 6 గంటల సమయానికి ప్రాంగణానికి చేరుకొని ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గుడారంలో గంటపాటు వివిధ నాయకులతో చర్చించిన అనంతరం 7 గంటలకు వేదికపైకి వచ్చి 40 నిమిషాలపాటు ప్రసంగించారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ చేసిన ప్రసంగానికి పెద్దగా స్పందన లభించలేదు. చాలా యేళ్ల తర్వాత పోరుగడ్డపై ఏర్పాటు చేసిన రజతోత్సవ సభలో ఆయన ప్రసంగానికి అద్భుత స్పందన లభించడంతో బీఆర్‌ఎస్ నాయకుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. ఆయన ప్రసంగం పూర్తయ్యేవరకు కూడా కార్యకర్తలు, పార్టీ నాయకులు కదలకుండా కూర్చున్నారు. సభా ప్రాంగణం బయట కూడా భారీసంఖ్యలో జనం కనిపించారు.