calender_icon.png 28 April, 2025 | 6:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని.. కాంగ్రెస్ 14 ఏళ్లు ఏడిపించింది

27-04-2025 07:56:47 PM

పదేళ్ల పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపంచాం

హైదరాబాద్: బలవంతంగా 1956లో తెలంగాణ(Telangana)ను ఏపీలో విలీనం చేసింది జవహార్ లాల్(Jawaharlal Nehru) నెహ్రూనేనని కేసీఆర్ అన్నారు. 14 ఏళ్లు కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని చెప్పి మనల్ని ఏడిపించిందని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ రాజకీయాల అవసరం కోసం.. మన పోరాటానికి భయపడి తెలంగాణను ఇచ్చిందని కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) స్పష్టం చేశారు. 1969లో తెలంగాణ ఉద్యమం వస్తే.. నిరంకుశంగా అణిచివేసింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు తర్వాత మలిదశ ఉద్యమం ఉద్ధృతమైందని తెలిపారు.  తెలంగాణ ఇస్తామని ప్రకటన చేసి.. ఆంధ్రలో వ్యతిరేకత రాగానే మళ్లీ వెనక్కి తగ్గారని తెలిపారు. సాగరహారం, వంటావార్పు, సకలజనుల సమ్మె వంటి కార్యక్రమాలతో ఉద్యమాన్ని ఉద్ధృతం చేశామని వెల్లడించారు. 

సాధించుకున్న తెలంగాణలో ప్రజలు దీవించి పదేళ్ల పాటు అవకాశం ఇచ్చారన్నారు. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించామని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి సాగుభూమిని గణనీయంగా పెంచామన్నారు. మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాం, అద్భుతమైన తెలంగాణ నిర్మించుకున్నామని పేర్కొన్నారు. పంజాబ్ ను తలదన్నేలా పంటలు పండే తెలంగాణను నిర్మించుకున్నామని గుర్తుచేశారు. షేర్ షా కాలం నుంచి స్వాతంత్య్రం వచ్చే వరకు రైతుల నుంచి ఎన్నో పన్నులు వసూలు చేశారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల నుంచి పన్నులు వసూలు చేసిన వారే తప్ప.. రైతులకు మేలు చేసిన వాళ్లు లేరు.. రైతులు ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకున్న నాథుడే లేడన్న కేసీఆర్ రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని రైతుబంధు పథకం తీసుకువచ్చానని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబీమా అమలు చేసి రైతు కుటుంబాలను ఆదుకుందని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు పథకం నిరాటంకంగా అమలైందని చెప్పిన ఆయన వానాకాలం, యాసంగి పంటలకు సకాలంలో రైతుబంధు జమ చేశామని వ్యాఖ్యానించారు. ఎన్నికల అజెండాలో చెప్పని ఎన్నో పథకాలను అమలు చేశామని కేసీఆర్ పేర్కొన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కళ్యాణలక్ష్మి, చేపల పెంపకం వంటివి అమలు చేశామన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించి ఉద్యోగ అవకాశాలు పెరిగేలా చేశామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 3 మాత్రమే ఉన్న వైద్య కళాశాల సంఖ్యను 30కి పెంచామని గుర్తుచేశారు.