సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు
గజ్వేల్, నవంబర్ 22: నమ్మి భూముల్వివడంతో పాటు ఓట్లేసి గెలిపించిన మల్లన్నసాగర్ భూనిర్వాసితులకు కేసీఆర్ అండగా నిలవాలని, వారి సమస్యలను అసెంబ్లీలో చర్చించి పరిష్కారానికి కృషి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు. శుక్రవారం గజ్వేల్ ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో పెండింగ్ పనులను పరిశీలించడంతో పాటు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం సీపీఐ నియోజకవర్గ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామాల్లో ఎవరిని కదిలించినా కష్టాలు, సమస్యలు వెల్లబోసుకుంటున్నారని, గ్రామాలను కోల్పోయి ప్రజలంతా అనాథలుగా మారారన్నారు. కేసీఆర్‌పై ముంపుగ్రామాల ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో సహకరించిన ప్రజలను అన్నిరకాల ఆదుకుంటామని చెప్పి, ఇప్పుడు ముఖం చాటేయడం తగదని వాపోయారు.
అసైన్డ్, లావణీ పట్టా భూములకు సరైన పరిహారం ఇవ్వలేదని, అర్హులందరికీ ఇండ్లు కేటాయించలేదని, ప్యాకేజీలు పూర్తిగా ఇవ్వలేదని కూనమనేని సాంబశివరావు ఆరోపించారు. కార్యక్రమానికి సీపీఐ గజ్వేల్ ఇన్‌చార్జి శివలింగు కృష్ణ అధ్యక్షత వహించగా, జిల్లా కార్యదర్శి మందపవన్, మాజీ కార్యదర్శి దయానందరెడ్డి పాల్గొన్నారు.