calender_icon.png 29 January, 2025 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ క్షమాపణ చెప్పాలి

14-11-2024 01:06:14 AM

నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 

  1. 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్‌కు కలెక్టర్‌పై దాడి చేయడం కరెక్ట్ కాదని తెలియదా?
  2. లగచర్లలో కలెక్టర్‌పై దాడి వెనుక బీఆర్‌ఎస్ హస్తం
  3. కేసుల భయంతోనే దాడులకు వ్యూహరచన 
  4. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 

నల్లగొండ, నవంబర్ 13 (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై దాడికి బాధ్యతవహిస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. పదేండ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ కలెక్టర్‌పై దాడి జరిగితే ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. 80 వేల పుస్తకాలు చదివిన ఆయనకు కలెక్టర్‌పై దాడి చేయడం కరెక్ట్ కాదని తెలియదా అని ప్రశ్నించారు.

నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం మీడియాతో మంత్రి మాట్లాడారు. ప్రణాళిక ప్రకారమే కలెక్టర్‌ను పిలిచి దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఘటనపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరుపుతున్నదని, దాడి వెనుక ఎంతటి వారున్నా విడిచిపెట్టబోమని హెచ్చరించారు.  దాడిలో బీఆర్‌ఎస్ నేతల హస్తం ఉన్నదని మంత్రి ఆక్షేపించారు.

అధికారంలో ఉన్నప్పుడు నియంతృత్వం.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రౌడీయిజం చేయడం బీఆర్‌ఎస్ సూడో రాజకీయాలకు నిదర్శమని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాస్వామ్యయుతంగా పాలన సాగిస్తుంటే..

దాడులతో అధికారులను భయభ్రాంతులకు గురిచేసి బీఆర్‌ఎస్ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నదని విమర్శించారు. అధికారం కోల్పోయామన్న అసహనంతో బీఆర్‌ఎస్ కీలక నేతలు దాడులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. లగచర్లలో కలెక్టర్‌పై దాడికి పాల్పడిన వారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ఫోన్‌లో టచ్‌లో ఉన్నారని ఆరోపించారు. 

ట్యాపింగ్ దొంగలు ఊచలు లెక్కించాల్సిందే

నల్లగొండ జిల్లాలోనే అత్యధికంగా టెలిఫోన్ ట్యాపింగ్ దొంగలున్నారని, ఈ కేసులో విచారణ పూర్తయితే వీరంతా ఊచలు లెక్కించాల్సిదేనని మంత్రి కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. మాజీ డీజీపీ ప్రభాకర్‌రావు బయటకు వస్తే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల బాగోతాలు బయటకు వస్తాయన్నారు.

ట్యాపింగ్ కేసులో 70 శాతం మంది బీఆర్‌ఎస్ నేతలు జైలుకు వెళ్తారని పేర్కొన్నారు. ధరణి కుంభకోణం అమోయ్ కుమార్‌తోపాటు ఎంతమంది ఐఏఎస్ అధికారుల మెడకు చుట్టుకుంటుందో తెలియదని పేర్కొన్నారు. ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశాలకు నగదు తరలించిన కేసులో గవర్నర్ అనుమతి రాగానే అరెస్టులు ప్రారంభమవుతాయని చెప్పారు. 

మిల్లర్లు రైతులకు సహకరించాలి

ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులకు గురి చేయకుండా మిల్లర్లు రైతు లకు సహకరించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సూచించారు. నల్ల గొండకలెక్టరేట్‌లో జిల్లా ఉన్నతాధికారులు, రైస్ మిల్లర్లతో ధాన్యం కొనుగో ళ్లపై సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లలో రై తులను ఇబ్బందులకు గురిచేసే మిల్లర్లపై ఎస్మా ప్రయో గిస్తామని సీఎం హెచ్చరించినా కొంద రు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

10 శాతం నామమాత్రం బ్యాంకు గ్యారంటీతో ధాన్యా న్ని కొనుగోలు చేయాలని చెప్పినా సహకరించకుండా ఇబ్బందులు సృష్టించడం సరికాదన్నారు. రైతుల శ్రమను దోచుకుంటున్న కొందరు మిల్లర్ల చిట్టా తీస్తున్నామని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధాన్యాన్ని సకాలంలో కొని చెల్లింపులు చేసిన మిల్లర్లకు ప్రోత్సాహకాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

వారం రోజుల్లో జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో రూ.16 కోట్ల విలువైన ధాన్యం కొన్నట్టు మంత్రి తెలిపారు. 4,048 రైతులకు రూ.50 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. సమావేశంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌చంద్ర పవార్, మిర్యాలగూడ, నాగార్జున సాగర్ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి,  జైవీర్‌రెడ్డి పాల్గొన్నారు. 

కేంద్ర మంత్రులు నోరుమెదపరెందుకు?

ఉమ్మడి జిల్లాలో కొందరు రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందికి గురిచేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి చేరిన వీరి ఆగడాలకు త్వరలో అడ్డుకట్ట వేస్తామన్నారు. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులున్నా పత్తి కొనుగోళ్లపై నోరు మెదపరెందుకని మంత్రి ప్రశ్నించారు.

పత్తికి మద్దతు ధర కల్పించడంలో బీజేపీ సర్కారు దారుణంగా విఫలమైందని ధ్వజమెత్తారు. రాజకీయ ప్రయోజనం కోసం మూసీ ప్రక్షాళను అడ్డుకుంటామని మాట్లాడుతున్న బీజేపీ నేతలు రైతుల సమస్యలపై మాట్లాడకపోవడం శోచనీయమన్నారు.