calender_icon.png 30 October, 2024 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ క్షమాపణ చెప్పాలి

13-09-2024 12:26:52 AM

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలు సరికావు.. పార్టీ ఫిరాయింపుల చట్టం కఠినంగా ఉంటే.. మా ప్రభుత్వానికే మంచిది 

  1. అప్పుడు ప్రోత్సహించినవారే ఇప్పుడు నీతులు చెబుతున్నారు 
  2. బీఆర్‌ఎస్ నేతలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం 
  3. పీఏసీ చైర్మన్ ప్రతిపక్షానికే ఇచ్చాం 
  4. గతంలో కాంగ్రెస్‌ను కాదని ఎంఐఎంకు పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారు 
  5. ఎమ్మెల్యేల అనర్హత అంశం స్పీకర్ పరిధిలోనిదని వ్యాఖ్య 

హైదరాబాద్,సెప్టెంబర్ 12 (విజయక్రాంతి):  బతకడానికి వచ్చిన వారని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని ఉద్దేశించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతున్నారని, అలా బతకడానికి వచ్చిన వాళ్ల  ఓట్లు కావాలి.. వాళ్లకు టికెట్లు ఇవ్వొద్దా..? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కౌశిక్‌రెడ్డి మాటలకు అర్థం లేదని, బతకడానికి వచ్చారని అన్న మాటలపై కేసీఆర్ కుటుంబం క్షమాపణలు చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు.

ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఇస్తే.. ఆయన్ను బతకడానికి వచ్చిన వాళ్లనడం సరికాదన్నారు. ఒక వేళ కేసీఆర్, కేటీఆర్‌కు తెలియకుండా కౌశిక్‌రెడ్డి మాట్లాడి ఉంటే.. పార్టీ నుంచి ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. 

మా ప్రభుత్వానికే మంచిది 

పార్టీ ఫిరాయింపుల చట్టం కఠినంగా ఉంటే మా ప్రభుత్వానికే మంచిదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పార్టీ ఫిరాయింపులపై కోర్టుల నిర్ణయాలు తమకే మేలు చేస్తాయని, మా పార్టీకి అసెంబ్లీలో 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, వారిలో ఏ ఎమ్మెల్యే కూడా  చేజారకపోతే తమ ప్రభుత్వం బలంగా ఉంటుందని సీఎం వ్యాఖ్యానించారు.  గురువారం సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు తమ ప్రభుత్వాన్ని మూడు నెలల్లో, ఆరు నెలల్లో పడగొడుతామంటూ   గడువులు పెట్టారని గుర్తుచేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం, ఫిరాయింపు నిరోధకచట్టం కఠినంగా ఉండాలన్నారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే  పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారని, వారే ఇప్పుడు నీతులు చెబుతున్నారని  సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ముగ్గురు ఎమ్మెల్యేల వ్యవహారం  కోర్టు పరిధిలో ఉందని, ఆ విషయంపై తాను ఎలాంటి కామెంట్ చేయనని, స్పీకర్ ఈ విషయంపై నిర్ణయాన్ని తీసుకుంటారని  సీఎం పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేకే  పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చామన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంటే ఎంఐఎంకు పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారని, 2019 నుంచి అక్బరుద్దీన్ పీఏసీ చైర్మన్‌గా ఉన్నారనే విషయాన్ని సీఎం గుర్తు చేశారు. 

జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం..

జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, భద్రత కోసం తగిన చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం సీఎం రేవంత్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలకు ఢిల్లీలోని తెలుగు జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు.  

సీఎంతో జరిగిన ఆత్మీయ సమావేశంలో జర్నలిస్టుల ఇళ్లు, హెల్త్ కార్డులు, అక్రెడిటేషన్ కార్డులపై చర్చించారు. జర్నలిస్టు సంక్షేమానికి రూ. 10 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..  వ్యవస్థలో జర్నలిస్టులు కీలకమని, బాధ్యాతయుతమైన రిపోర్టింగ్‌కు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని  స్పష్టం చేశారు.