calender_icon.png 18 April, 2025 | 8:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన విప్లవకారుడు మహాత్మా ఫూలే

11-04-2025 10:54:22 AM

హైదరాబాద్: మహాత్మా ఫూలే జయంతి(Mahatma Phule Jayanti) సందర్భంగా సబ్బండ కులాల అభ్యున్నతికి, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి, త్యాగాలను  బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) స్మరించుకున్నారు. వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన భారత సామాజిక విప్లవకారుడు మహాత్మా ఫూలే అని కేసీఆర్ తెలిపారు. సబ్బండ కులాల అభ్యున్నతి కోసం, నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఫూలే ఆశయాలను అమలు చేసిందని గుర్తుచేశారు. అదే స్ఫూర్తిని కొనసాగించడం ద్వారా మాత్రమే సామాజిక ప్రగతి సాధ్యమవుతోందని ఆయన స్పష్టం చేశారు.

శక్తివంతమైన భారత సమాజ ఐక్యతను బలహీనపరిచే వర్ణకుల వివక్ష నుండి విముక్తి కోసం తన జీవిత కాలమంతా పోరాడిన మహాత్మా జ్యోతిరావు ఫూలే(Mahatma Jyotirao Phule)ను భారత సామాజిక విప్లవకారుడిగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్(BRS chief KCR) కొనియాడారు. కులం, లింగం వంటి సామాజిక రుగ్మతలను రెండు శతాబ్దాల క్రితమే పసిగట్టి, పరిష్కార మార్గాలను సూచించిన సామాజిక దార్శనికుడు మహాత్మ ఫూలేనని తెలిపారు. ఉత్పత్తికులాలైన సబ్బండ వర్ణాల అభ్యున్నతికి, నాటి తెలంగాణ తొలి ప్రభుత్వం ఫూలే ఆదర్శాలను(Jyotirao Phule Ideals) కార్యాచరణలో పెట్టిందని గుర్తుచేశారు. వ్యవసాయం, దానికి అనుబంధ రంగాలే కేంద్రంగా భారత కులవృత్తుల సామాజిక,సాంస్కృతిక జీవన విధానం రూపొందిందని, ఈ చారిత్రక నేపథ్యాన్ని అవగాహన చేసుకున్న తొలి తెలంగాణ ప్రభుత్వం ఆ రంగాలను పాలనా ప్రాధాన్యతగా తీసుకుందని వివరించారు.

సామాజిక న్యాయం అందించడంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రాజెక్టుల ద్వారా సాగునీరు, ఉచిత విద్యుత్, రైతుబంధు, పంట పెట్టుబడి, పండిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయడం వంటి కీలక కార్యాచరణలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయిందని కేసీఆర్ పేర్కొన్నారు. పేదల కొనుగోలు శక్తి పెరిగి, ఆర్థిక భరోసా కూడా పెరిగిందని వెల్లడించారు. దీని ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో స్పిన్ ఎకానమీ జరిగిందని, బీఆర్‌ఎస్(Bharat Rashtra Samithi) ప్రభుత్వ విధానాల వల్ల దేశ ప్రగతిలో తెలంగాణ రాష్ట్రం(Telangana State) కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల్లో ఆత్మస్థైర్యం పెరిగి, సామాజిక ఉద్దీపన ఏర్పడిందని, బీసీ, ఎస్సీ వర్గాల గౌరవం పెరిగిందని ఆయన సూచించారు. శతాబ్దాలుగా బీసీలుగా వెనకబడిన కులాల ప్రజలు, బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ప్రధాన సామాజిక ఆర్థిక స్రవంతిలో ముందువరుసకు వచ్చారని, దీనిని దేశం గుర్తించిందని చెప్పారు. ఫూలే స్ఫూర్తితో తొలి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణను నేటి ప్రభుత్వం చిత్తశుద్ధితో కొనసాగించాలనీ, అలా చేస్తేనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా, మైనారిటీ, పేద వర్గాలకు ఫూలే దంపతుల ఆకాంక్షలు నెరవేరతాయని కేసీఆర్ స్పష్టం సూచించారు.