హైదరాబాద్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం ఆదివారం ఎర్రవల్లి ఫామ్ హౌజ్ లో జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వామన్నారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా..?, అధికారంలోకి వచ్చిన ప్రతి పభుత్వం మార్పులు చేసుకుంటే పోతే ఎలా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజాల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రేపటి నుంచి జరుగబోయే అసెంబ్లీ సమావేశాలకు రావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
అంశాలవారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని, గతంలో బీఆర్ఎస్ రైతులకు రైతుబంధు తెచ్చిన ఉద్దేశం, ప్రయోజనాలు, ఉద్యమంలో తెలంగాణ తల్లి అందించిన స్పూర్తిని వివరించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని కేసీఆర్ మండిపడ్డారు. గురుకులాలు, విద్యారంగంలో వైఫల్యాలను, మూసీ, హైడ్రా విషయంలో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని తమ నేతలకు తెలిపారు. నిర్భంద పాలన గురించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలని, కాంగ్రెస్ మేనిఫెస్టో ఆధారంగా వైఫల్యాలను ఎత్తి చూపాలని కోరారు. అలాగే ఫిబ్రవరి బహిరంగ సభలో కాంగ్రెస్ సర్కార్ వైఖరిని రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తామని, ఫిబ్రవరి తర్వాత పార్టీలో అన్ని కమిటీలు ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదు ప్రక్రియను మొదలు పెడతామని కేసీఆర్ వెల్లడించారు.