calender_icon.png 16 October, 2024 | 10:52 PM

కేటీఆర్ సభను విజయవంతం చేయండి

16-10-2024 08:10:31 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): మూసీ నది ప్రాజెక్ట్ లో భారీ స్కాం చోటు చేసుకుందని ఆరోపించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, అక్రమ కేసులతో తమను ఆపలేరని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న స్పష్టం చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలపై ధ్వజమెత్తారు. ఈనెల 24న ఆదిలాబాద్ లో నిర్వహించే కేటీఆర్ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ...  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజానికానికి హామీలు ఇచ్చి మోసం చేశారని ఈనెల 8వ తేదీన డిఎస్పీకి కి ఫిర్యాదు చేశామని, ఇప్పటికీ కేసు నమోదు కాలేదు. కానీ మూసినదిపై ఆరోపణలు చేసిన కేటీఆర్ పై వెంటనే కేసు నమోదు చేయడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. 420 హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల ఆశలను గల్లంతు చేశారని, రైతు భరోసా, రుణమాఫీ వంటి హామీలను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలను గుర్తు చేశారు. అలాగే రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తూ రైతుల ఆత్మహత్యలను ప్రేరేపించడం తగదన్నారు. రుణమాఫీ విషయంలో ప్రధానికి సైతం అబద్ధాలతో కూడిన లేఖ రాశారన్నారు.

క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు పరిస్థితి పూర్తిగా విభిన్నంగా ఉందన్నారు. సంపూర్ణ రుణమాఫీ కాకపోవడం, రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం విడుదల కాకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దాదాపు ఆరేడు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుని తనువు చాలించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు కారణమైన ముఖ్యమంత్రి పై కేసులు పెట్టాలని కోరితే ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతుకను అనిచివేస్తున్న ప్రభుత్వ విధానాలను ప్రజలంతా గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు రోకండ్ల రమేష్, అజయ్, ఇజ్జగిరి నారాయణ, యాసం నర్సింగరావు, మార్శెట్టి గోవర్ధన్, కుంమ్ర రాజు, పరమేశ్వర్, ఇజ్జగిరి అశోక్, పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు.