calender_icon.png 16 March, 2025 | 4:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల ఆత్మహత్యలకు కేసీఆరే కారణం

16-03-2025 01:14:56 AM

  • పనిమంతుడేసిన పందిరి కుక్కతోక తాకి కూలినట్టు కాళేశ్వరం.. కూళేశ్వరమైంది 
  • నిద్రపోయేవాళ్లను లేపోచ్చు.. నటించేవారిని లేపలేం 
  • మండలిలో సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్ 
  • సభనుంచి బీఆర్‌ఎస్ వాకౌట్

హైదరాబాద్, మార్చి 15 (విజయక్రాంతి): గత పదేండ్లలో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు కేసీఆరే కారణమని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పనిమంతుడు పందిరేస్తే.. కుక్క తోకతాకి కూలినట్టు కాళేశ్వరం కూళేశ్వరమైందని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యావాదాలు తెలిపే అంశంపై శనివారం శాసనమండలిలో సీఎం మాట్లాడుతూ.. నిద్రపోయేవారిని లేపోచ్చేమోగానీ, నటించే వారిని లేపలేమంటూ మాజీ సీఎం కేసీఆర్‌ను ఎద్దేవా చేశారు. ఆయన వర్క్‌ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? లేక వర్క్ ఫ్రమ్ ఫామ్‌హౌసా? అంటూ ప్రశ్నించారు.

కాళేశ్వరం నుంచి చుక్కనీరు రాకుండానే 1.57 లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించామన్నారు. కోటిమంది మహిళలను కోటీ శ్వరులను చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. శాసనమండలిలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తుండ గానే బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం ప్రసంగానికి అడ్డుతగులుతున్నారని మండ లి చైర్మన్ వారించినా బీఆర్‌ఎస్ సభ్యులు పట్టించుకోలేదు.

మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, సభ బయట మాట్లాడిన అంశాలతో సభకు సంబంధం లేదని, బీఆర్‌ఎస్ సభ్యు లు సహకరించాలని మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. అయినా బీఆర్‌ఎస్‌ఎల్పీ నేత మధుసుదనాచారి, ఎమ్మెల్సీ కవిత, ఎల్ రమణ, వాణిదేవి, గోరెటి వెంకన్న, తాతా మధు తదితరులు వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించి సభ నుంచి బయటికి వెళ్లిపోయారు.  

తప్పులు తెలుస్తాయనే బీఆర్‌ఎస్ భయం: మంత్రి కొండా సురేఖ 

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో చేసిన తప్పులు ప్రజలకు తెలుస్తాయనే భయం వారికి పట్టుకుందని మండిపడ్డారు. వాస్తవాలను వినొద్దనే సభ నుంచి బీఆర్‌ఎస్ సభ్యులు మండలి నుంచి బయటికి వెళ్లిపోయారన్నారు. పదేళ్ల పాలనలో అప్పులు, తిప్పలే మిగిలాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. 

బీసీ సబ్‌ప్లాన్ ప్రకటించాలి: తీన్మార్ మల్లన్న 

బీసీల అభివృద్ధి కోసం బీసీ సబ్‌ప్లాన్‌ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రభుత్వాన్ని కోరారు. కామారెడ్డి డిక్లరేషన్ మేరకు బీసీలకిచ్చిన హామీలను అమలు చేయాలని, విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం బీసీలను పట్టించుకో లేదని, బీసీ ఫెడరేషన్లకు కేటాయించిన నిధులను కూడా విడుదల చేయలేదన్నారు.

దవాఖానల్లో సూది లేదు.. మందూ లేదు: ఎమ్మెల్సీ కవిత 

అంతకుముందు ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడమే తప్ప.. అభివృద్ధి, సంక్షేమం కనిపించడం లేదన్నారు. కనీసం ప్రభుత్వ దవాఖానల్లో సూది, దూదీ కూడా లేదని విమర్శించారు. కల్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం ఇవ్వకుండానే మహాలక్ష్మిపథకం ఎలా పూర్తయినట్టని కవిత ప్రశ్నించారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికను సభలో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు.

మంత్రి జూపల్లి.. బీఆర్‌ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం 

శాసనమండలిలో మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్‌ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. అప్పులు గురించి మంత్రి మాట్లాడుతుంటే.. మండలిలో ప్రతిపక్షనేత మధు సూదనచారి, కవిత, శేరి సుభాష్‌రెడ్డి, తాతా మధు, ఎల్ రమణ పలువురు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. శాసనమండలిలో సభ్యులు లేవనెత్తిన ప్రతీ అంశాన్ని నోటు చేసుకున్నానని, వీటన్నింటికి రాష్ట్ర ఆర్థిక సమస్యతో ముడిపడి ఉందన్నారు.

64 ఏళ్లలో 19 మంది ముఖ్యమంత్రులు రూ.65 వేల కోట్ల అప్పులు చేస్తే.. కేసీఆర్ పదేళ్లలో రూ.7.11 లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు. ఈ అప్పులకు నెలకు అసలు, వడ్డీ కలిపి రూ.6,500 కోట్లు, ఏడాదికి రూ.78 వేల కోట్లు అవుతుందని వెల్లడించారు. ‘మీరు అవునన్నా.. కాదన్న అప్పులు చేసింది నిజం కాదా? ఐ స్టాండ్ మై వర్డ్స్.. ఐ స్టాండ్ మై స్టేట్‌మెంట్ ’ అంటూ మంత్రి జూపల్లి సవాల్ విసిరారు.