- గుట్టు చప్పుడు కాకుండా మంత్రివర్గ ఆమోదం
- తప్పుడు వివరాలతో కేంద్ర పర్యావరణ అనుమతులు
- రెడ్ కేటగిరీ ఫ్యాక్టరీకి గ్రీన్ కేటగిరీ సర్టిఫికెట్
- బీఆర్‌ఎస్ నాయకుని కోసమే ఫైల్‌పై అప్పటి సీఎం కేసీఆర్ సంతకం
హైదరాబాద్, నవంబర్ 29 (విజయ క్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన దిలావర్‌పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ అంశం అటు ఇటు తిరిగి మాజీ సీఎం కేసీఆర్ మెడకు చుట్టుకుంటున్నది. దీంతో ఇప్పటి వరకు ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై అలుముకున్న చిక్కు ముడులు వీడుతున్నాయి.
అవాస్తవాలతో ప్రజల్లో అపో హలు సృష్టించి వారు ఆవేదనతో ప్రభుత్వానికి ఎదురు తిరిగేలా చేస్తున్న బీఆర్ ఎస్ నాయకుల అధినేత కేసీఆరే సమస్యకు మూలకారణమని బయటపడింది. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానికులు చేస్తున్న ఆందోళనలో అర్థం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుబట్టడంతో నిజాలను బహిర్గతం చేసేం దుకు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నది.
అయితే గత ప్రభుత్వ హయాంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతి ఇచ్చిన బీఆర్‌ఎస్ నాయకులే స్థానికుల పక్షాన చేరి ఆందోళన చేస్తుండటం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. అసలు విషయం తెలియక స్థానిక ప్రజలు ప్రభుత్వ అధికారులపై దాడులకు సైతం వెనుకాడట్లేదు.
అంతా కేసీఆర్ డైరెక్షన్‌లోనే..
ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును ఆసరా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టాలకున్న బీఆర్‌ఎస్ వ్యూహం బెడిసికొట్టింది. వాళ్లు తీసుకున్న గోతిలో వాళ్లే పడినట్లుంది. ఇథనాల్ ఫ్యాక్టరీ బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కుమారునిదే అని ఆధారాలను ప్రభుత్వం బయటపెట్టింది. అప్పటి సీఎం కేసీఆర్ సంతకంతోనే ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆమోదం లభించిందని ప్రభుత్వం వెల్లడించింది.
అయి తే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి లేని ఉత్పత్తులకు అప్పటి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై సర్వత్రా అనుమానాలు రెకేత్తుతున్నా యి. బీఆర్‌ఎస్ నాయకు ని కంపెనీ కావడంతోనే ఆగమేఘాలపై ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పా టుకు మాజీ సీఎం కేసీఆర్ సంతకం చేశారని కాంగ్రెస్ ప్రభు త్వం ఆరోపిస్తుంది.
ముఖ్యంగా ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఇథనాల్ ఫ్యాక్టరీకి మినహాయింపు ఇవ్వడం వెనుక కేసీఆర్ పాత్ర ప్రధానంగా ఉందని ఆధారాలను ప్రభుత్వం సేకరించింది.
స్థానిక గ్రామ పంచాయతీ నుంచి ఎన్‌వోసీ కూడా తీసుకోకుండా ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభించడం, గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీఎస్ ద్వారా రెడ్ కేటగిరి ఫ్యాక్టరీకి అత్యవసరం పేరిట అనుమతులు ఇవ్వడం వెనుక భారీగా గోల్‌మాల్ జరిగిందని కాంగ్రె స్ ప్రభుత్వం సందేహాలు వ్యక్తం చేస్తుంది.
ప్రతిష్టాత్మకమని చెప్పుకునే టీఎస్ బీఆర్‌ఎస్ నాయకులకు లాభం చేకూర్చేందుకు రైతులకు సైతం అన్యాయం చేయడా నికి వెనుకాడకుండా ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు ఇచ్చిన గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.
నిబంధనల ఉల్లంఘన జరిగింది..
దేశంలోని ఎక్కడైనా, ఏ రాష్ట్రంలో ఫ్యాక్టరీలు, పరిశ్రమలు ప్రారంభించాలంటే మొదట కేంద్ర పర్యావరణ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చే అనుమతుల్లో నాలుగు కేటగిరిలు ఉంటాయి. రెడ్ కేటగిరి, ఆరెంజ్ కేటగిరి, గ్రీన్ కేటగిరి, వైట్ కేటగిరి... అయితే స్థాపించే ఫ్యాక్టరీలు స్థానికంగా ఉండే ప్రజలకుగానీ, పర్యావరణానికిగానీ ఎలాంటి హానీ చేయకుండా ఉంటే వాటికి గ్రీన్, వైట్ కేటగిరిల కింద అనుమతులు లభిస్తాయి.
ఒక మోస్తరులో హానికారకం అయిన కంపెనీలకు ఆరెంజ్ కేటగిరి అనుమతులు జారీచేస్తారు. స్థానికంగా అధిక స్థాయిలో హాని కల్గించే కంపెనీలకు మాత్రం రెడ్ కేటగిరిలో అనుమతులు ఇస్తారు. అయితే వాస్తవానికి దిలావర్‌పూర్‌లో ఏర్పాటు చేసే ఇథనాల్ ఫ్యాక్టరీ రెడ్ కేటగిరిలోకి వెళ్లాల్సిన ఫ్యాక్టరీ. కానీ ఇక్కడే అసలైన గోల్‌మాల్ జరిగింది.
ఈ ఫ్యాక్టరీలో కేవలం ఫ్యూయల్ ఇథనాల్ మాత్రమే ఉత్పత్తి చేస్తామని దరఖాస్తు చేసుకుని కేంద్ర పర్యావరణ అనుమతులు తీసుకున్నారు. కానీ దిలావర్‌పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీలో ఇథనాల్, ఎక్స్‌ట్రా న్యూటల్ ఇథనాల్, ఇండస్ట్రీయల్ స్పిరిట్స్, అబ్జల్యూట్ ఆల్కహాల్ వంటి హానికారకాలను కూడా ఉత్పత్తి చేసేటట్లు గోల్‌మాల్ చేశారు.
అయితే ఇంత యధేచ్చగా ఇథనాల్ ఫ్యాక్టరీ యజమానులు ఈ ఉత్పత్తికి ధైర్యం చేయడానికి కారణం అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం, అప్పటి సీఎం కేసీఆర్. కేంద్ర పర్యావరణ అనుమతులను తుంగలో తొక్కి ఇథనాల్, ఎక్స్‌ట్రా న్యూటల్ ఇథనాల్, ఇండస్ట్రీయల్ స్పిరిట్స్, అబ్జల్యూట్ ఆల్కహాల్ వంటి వాటికి సైతం కేసీఆర్ క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.
ప్రజాభిప్రాయం లేకుండా.. గుట్టుచప్పుడు కాకుండా..
వాస్తవానికి ఆరెంజ్ కేటగిరి లేదా రెడ్ కేటగిరిలోని ఫ్యాక్టరీల ఏర్పాటుకు స్థానిక గ్రామ పంచాయతీగానీ, మున్సిపాలిటీ నుంచి గానీ నో అబ్జక్షన్ లెటర్ తీసుకోవడం తప్పనిసరి. దీంతోపాటు స్థానికంగా ఉండే ప్రజల అభిప్రాయాన్ని కూడా తీసుకోవాలి. కానీ గత పాలకులు నో అబ్జక్షన్ లెటర్ తీసుకోక పోగా స్థానికుల అభిప్రాయానికి కూడా మినహాయింపునిచ్చారు.
ఫ్యూయల్ ఇథనాల్ ఉత్పత్తిని సాకుగా చూపించి, ప్రత్యేక అవసరం పేరిట గ్రామ పంచాయతీ నుంచి ఎన్‌వోసీతోపాటు ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా చేశారు. బీఆర్‌ఎస్ నాయకునికి చెందిన కంపెనీ కావడంతో మంత్రివర్గంలో అడ్డగోలుగా అనుమతులు జారీ చేశారు. అయితే కేంద్ర పర్యావరణ శాఖ నుంచి ఫ్యూయల్ ఇథనాల్‌కు అనుమతి తీసుకున్నప్పటికీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షించాల్సిన అవసరం ఉంటుంది.
కానీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం గానీ, కేసీఆర్‌గానీ తమకు తెలియకుండా జరిగిందని బుకాయించడానికి ఆస్కారమే లేదు. ముఖ్యంగా దిలావర్‌పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన అనుమతులపై అప్పటి సీఎంగా కేసీఆర్ సంతకాలు సైతం ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆధారాలను బయటపెట్టింది.
దీంతో గత ప్రభుత్వంలోనే అనుమతి ఇచ్చిన ఇథనాల్ ఫ్యాక్టరీ పాపానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చుట్టాలనుకున్న బీఆర్‌ఎస్ వ్యూహాలు బెడిసికొట్టాయి. ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టిన బీఆర్‌ఎస్ నాయకులే తెలంగాణ ప్రజానీకం ముందు దోషులుగా నిలబడాల్సి వచ్చింది.