18-02-2025 12:43:18 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): తెలంగాణభవన్‌లో మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. వేడుకలకు మాజీమంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సత్యవతిరాథోడ్, శాసనమండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారితో పాటు ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ నేతలందరూ 71 కిలోల కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌పై ప్ర త్యేకంగా రూపొందించిన డాక్యుమెంటరీని పార్టీ నాయకులందరూ కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలోని ఏమూలకు పోయినా తిరిగి కేసీఆరే సీఎం కావాలన్న స్వరాలు వినిపిస్తున్నాయన్నారు.
కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రి చేసే ఏకైక లక్ష్యంతో 60 లక్షల గులాబీదండు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇదే ఆ మహాను భావుడికి గులాబీ సైనికులు ఇచ్చే పుట్టినరోజు కానుక అన్నారు. “మా నాన్న నాకు ఒక్కడికే హీరో కాదు. మొత్తం తెలంగాణ జాతికే హీరో. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు హీరో.
సమైక్య దోపిడీ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించిన కారణజన్ముడు కేసీఆర్. ఆయన కొడుకుగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతం” అని కేటీఆర్ భావోద్వేగంతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 14 నెలలుగా ఎక్కడ చూసినా సంక్షోభం నెలకొందన్నారు.
కారణజన్ముడు కేసీఆర్: మధుసూదనాచారి
కేసీఆర్ కారణజన్ముడని మండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి చెప్పారు. కేసీఆర్ పుట్టినరోజు అంటే రాష్ట్రానికి పర్వదినమన్నారు. తమ నాయకుడు కేసీఆర్ కండ్లు తెరిస్తే రేవంత్‌రెడ్డి మాయం కావాల్సిందేనని హెచ్చరించారు.
ఆలయంలో కవిత పూజలు
మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నందీనగర్‌లోని వీరాంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్‌కు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, రాష్ట్రానికి మంచి జరగాలని భగవంతుడికి పూజలు చేశారు.
కేసీఆర్ అంటే భావోద్వేగం: హరీశ్‌రావు
కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు.. నాలు గు కోట్ల ప్రజల భావోద్వేగమని మాజీమంత్రి హరీశ్‌రావు కొనియాడారు. కేసీఆర్ దీక్షతో కాంగ్రెస్ దిగొచ్చి తెలంగాణ ప్రకటించిందన్నారు. కేసీఆర్ తెలం గాణను ప్రతీ రంగంలో రోల్ మోడల్ గా నిలిపారని చెప్పారు. కేసీఆర్‌కు, తెలంగాణకు తల్లి బిడ్డ బంధమన్నారు.
తాను ట్వంటీ-20 మ్యాచ్ ఆడుతున్నానని అంటున్నారని, డబ్బు సంచుల కోసం మ్యాచ్‌లు ఆడేదెవరో ప్రజలకు తెలుసని పరోక్షంగా సీఎం రేవంత్‌ను ఎద్దేవా చేశారు. “కేసీఆర్‌కు అన్ని అడొచ్చు.. అవసరమైతే డిఫెన్స్ అడుతారు.. అవసరం అయితే సిక్స్ కొడుతారు..”అని తెలిపారు.