పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్
హైదరాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): మాజీ సీఎం కేసీర్ పగటి కలలు కంటున్నారని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ విమర్శించారు. నాలుగు నెలల తర్వాత బయటికి వచ్చిన కేసీఆర్.. వచ్చేది తమ ప్రభుత్వమని చెబుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆదివారం ఎక్స్ వేదికగా దయాకర్ స్పందించారు.
కేసీఆర్‌ను భరించే ఓపిక తెలంగాణ ప్రజలకు ఉందని ఆయన భ్రమపడుతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో కేసీఆర్ విధ్వంసం చేసిన వ్యవస్థలను పునరుజ్జీవం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. బీఆర్‌ఎస్ హయాం లో జరిగిన అవినీతి క్షేత్రాలను కూల్చడమే లక్ష్యంగా ప్రభు త్వం పనిచేస్తుందని పేర్కొన్నారు.
మూసీ పునరుజ్జీవంతో హైదరాబాద్ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, మూసీ ప్రక్షాళన చేయడం కోసం అక్కడ ఉన్న ప్రజలకు ప్రత్యామ్నాయం ప్రభుత్వం చూపిస్తుందని వెల్లడించారు. బురదలో, మట్టిలో, ప్రాజెక్టులలో బీఆర్‌ఎస్ అవినీతి చేసినట్లుగా.. కాంగ్రెస్ ప్రభుత్వం చేయదని హితవు పలికారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఒకసారి బయటకు వచ్చారని, గత ఏడాదిగా కాలంగా కేసీఆర్ ఎక్కడున్నారో ఎవరికి తెలియదన్నారు. ఇప్పుడు బయటికి వచ్చి అధికారం తమదేనని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయన హితవు పలికారు.