హరీశ్‌రావు బీజేపీలోకి వెళ్తారు
జైలుకు వెళ్లేవారిని చేర్చుకోం
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి) : తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ సమాధి అయ్యిందని, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ వైపు చూస్తు న్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో కురియన్ కమిటీని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ను అధికారం నుంచి దింపాలనే ఒక లక్ష్యం నెరవేరిందని, ఇంకో లక్ష్యం కేసీఆర్‌ను జైలుకు పంపడమే మిగిలి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో అందరికి స్వేచ్ఛ ఉంటుందన్నారు.
బీఆర్‌ఎస్‌లో ఎవరూ ఉండరని, హరీశ్‌రావు బీజేపీలోకి వెళ్తారని తెలిపారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోమని, ఆయన జైలుకు వెళ్లే వ్యక్తి అని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఇంచార్జ్‌గా ఉండి పార్టీ అభ్యర్థిని గెలిపించినట్లు కమిటీకి వివరించానని ఆయన చెప్పారు. భువనగిరిలో బీజేపీ గెలుస్తుందనే టాక్ ఉన్నప్పటికీ.. తాను ఇంచార్జ్‌గా వెళ్లాక కాంగ్రెస్ వైపు గాలి మళ్లిందన్నారు. ఆరుగురు ఎమ్మెల్యేలం, పార్టీ అభ్యర్థి కలిసి ఐక్యంగా పనిచేయడం వల్లే 2 లక్షల మెజార్టీ వచ్చిందన్నారు.