27-04-2025 12:08:47 AM
హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఆయన కుటుంబ సభ్యుల నుంచే ప్రమాదం పొంచి ఉందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే ఆయన కొన్నేళ్లుగా ఫామ్‌హౌస్‌లోనే ఉంటున్నారని వాపోయారు.
కన్నబిడ్డలు కలవాలన్న ముందుగా అపాయింట్‌మెంట్ ఉండాల్సిందేనంటూ పేర్కొన్నారు. రూ.లక్ష కోట్ల అవినీతికి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిలువెత్తు నిదర్శనమని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో ప్రసంగించారు. మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బరాజ్‌లను ఖతంజేసి, ఏ మొహం పెట్టుకొని రజతోత్సవాలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు.
పార్టీ పేరు మార్చి తెలంగాణ పదమే లేకుండా చేశారని.. అంతటి దానికి రజతోత్సవం ఎందుకన్నారు. అక్రమాల నుంచి పోగేసుకున్న డబ్బులతో సభలు పెట్టి ప్రజలకు ఏం సందేశం ఇస్తారని ప్రశ్నించారు. ఆ మూడు బరాజ్‌లు తనకు తెలిసినంత వరకు పనికిరావని అర్వింద్ అన్నారు. ఎన్‌డీఎస్‌ఏ ఈ బరాజ్‌లపై విచారణను సుమోటోగా తీసుకుంటారని తెలిసే కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరపాలని లేఖ రాసిందన్నారు.
ఎలాంటి నిబంధనలు పాటించకుండానే బరాజ్‌ల ఫౌండేషన్లు, డిజైన్లను, లొకేషన్లనే మార్చారని, ఫలితంగా కూలిపోయే ప్రాజెక్టును అంటగట్టారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి కంటే దగ్గరి మిత్రుడు కేసీఆర్‌కు ఎవరూ లేరని ఆయన అన్నారు. కల్వకుంట్ల కుటుంబం తీవ్రవాదుల కంటే తక్కుమేమీ, కాదని అయితే సీఎం రేవంత్ రెడ్డి వీరి కన్నా ప్రమాదకరమని ఆరోపించారు.