calender_icon.png 18 November, 2024 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిండా ముంచింది కేసీఆరే

18-11-2024 01:41:08 AM

  1. మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్
  2. మిడ్ మానేరు నిర్వాసితులకు 4,696 ఇళ్లు మంజూరు
  3. రూ.230 కోట్లు విడుదల చేసిన సర్కార్
  4. త్వరలో మల్కపేట రిజర్వాయర్ ప్రారంభం
  5. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
  6. ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలభిషేకం

సిరిసిల్ల, నవంబర్ 17 (విజయక్రాంతి) : పదేళ్ల పాలనలో కేసీఆర్ మిడ్ మానేరు నిర్వాసితులను నిండా ముంచాడని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరిట కేసీఆర్ కోట్లు దోచుకుని నిర్వాసితులను రోడ్డున పడేస్తే, సీఎం రేవంత్‌రెడ్డి వారిని అక్కున చేర్చుకున్నాడన్నారు.

ఆదివారం సిరిసిల్లలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2018లో నిర్వాసితులకు కేసీఆర్ డబుల్ బెడ్రూం కింద రూ.5లక్షలు ఇస్తామని చెప్పి ఒక్కరికి కూడా ఇవ్వలేదన్నారు. ముంపు గ్రామాల సమస్యలను పరిష్కరించేందుకు మిడ్‌మానేరుకు వచ్చిన సందర్భంలో ఇచ్చిన మాటను ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి నిలబెట్టుకున్నారని తెలిపారు.

ఇచ్చిన హామీ మేరకు నిర్వాసితులకు 4,6౯6 ఇండ్ల మంజూరుతోపాటు రూ.236.80 కోట్ల నిధులు విడుదల చేశారన్నారు. త్వరలోనే మల్కపేట రిజర్వాయర్‌ను ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామన్నారు. గతంలో వేములవాడకు వచ్చిన కేసీఆర్ ఆలయ అభివృద్ధికి ప్రతి ఏడాది రూ.100కోట్లు కేటాయిస్తామని మోసం చేశాడన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హామీ ఇవ్వకపోయినా రూ.50కోట్లు విడుదల చేసిందని గుర్తు చేశారు.

నేతన్నల 30 ఏళ్ల కల అయిన యారన్ డిపోను 11 నెలల్లోనే తీసుకొచ్చామన్నారు. 20న వేములవాడకు సీఎం వస్తున్న సందర్భంగా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలని సూచించారు. ఈ సమావేశంలో సిరిసిల్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి కేకే మహేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

మిడ్ మానేరు నిర్వాసితులకు ఇండ్ల మంజూరుతో పాటు నిధులు విడుదల చేయడాన్ని హర్షిస్తూ సీఎం రేవంత్ చిత్రపటానికి ఎమ్మెల్యే శ్రీనివాస్ పాలాభిషేకం చేశారు. వేములవాడ నందికమాన్ వద్ద ముంపు గ్రామాల ప్రజలతో కలిసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో 12 ముంపు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

4,696 ఇళ్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు

మిడ్ మానేరు నిర్వాసితులకు 4,696 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాశ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. 12 గ్రామాలకు చెందిన 10,683 మందికి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద ఇళ్లు మంజూరు చేయాల్సి ఉండగా.. గతంలో 5,987 ఇళ్లు నిర్మించారు.

మిగిలిన 4,696 మందికి ఇళ్లను మంజూరు చేస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. స్టేట్ రిజర్వ్ కోటాలో నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణానికి రూ.5లక్షల చొప్పున మంజూరు చేసింది. వెంటనే ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ, రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌ను  ఆదేశించింది.