calender_icon.png 29 April, 2025 | 5:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణకు కేసీఆరే విలన్

29-04-2025 01:02:28 AM

  1. దొంగ పాస్‌పోర్ట్ బ్రోకర్‌కు గాంధీ కుటుంబంపై మాట్లాడే హక్కు లేదు
  2. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలన.. కాంగ్రెస్ 15 నెలల పాలనపై చర్చకు సిద్ధమా?: పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్

హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి) : తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మండిపడ్డారు. తెలంగాణకు ఫస్ట్ అండ్ లాస్ట్ విలన్ కేసీరేనని అన్నారు. కాంగ్రెస్ బిక్షతోనే సీఎం అయ్యాననే విషయాన్ని కేసీఆర్ మర్చిపోవద్దన్నారు. ఎల్కతుర్తి బీఆర్‌ఎస్ సభ అట్టర్ ప్లాప్ అయ్యిందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి కేసీఆర్ గుండెలో గుబులు మొదలైందని పీసీసీ చీఫ్ అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ శకం ముగిసిందని చెప్పారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్‌పై 420 హామీలని విమర్శిస్తున్న కేసీఆర్.. మీ పదేళ్ల పాలన, కాంగ్రెస్ ప్రభుత్వ 15 నెలల పాలనపై చర్చకు సిద్ధమా? టైమ్.. వేదిక మీరే డిసైడ్ చేయండి? చర్చకు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా? ఫామ్ హౌస్ దాటి వచ్చే దమ్ము కేసీఆర్‌కు ఉందా?’ అని మహేష్‌కుమార్‌గౌడ్ సవాల్ విసిరారు.

బీఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ కుటంబ రైజింగ్ అయిందని, జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్‌లు ఎవరివని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ అరాచక పాలనను తెలంగాణ ప్రజలు ఎప్పటికి క్షమించరన్నారు. రజతోత్సవ సభలో జనాలకంటే విస్కీ సీసాలు ఎక్కువగా ఉన్నాయని, ఆ సభలో ఒక్క మహిళ కూడా కనిపించలేదన్నారు.

దేశం కోసం ఆస్తులు, ప్రాణాలు త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని నకిలీ గాంధీలు అనడం కేసీఆర్ దుస్సాహసానికి పరాకాష్ట్ర అని, ఇందుకు కేసీఆర్ తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని మహేష్‌కుమార్‌గౌడ్ హెచ్చరించారు. గాంధీ కుటుంబం బిక్షతోనే దొంగ పాస్‌పోర్టుల బిజినెస్ చేసుకునే మీ కుటంబం లక్షల కోట్లకు పడగలెత్తారని, గాంధీ కుటుంబాన్ని విమర్శించే హక్కు కేసీఆర్‌కు లేదని ఆయన ధ్వజమెత్తారు.

బీఆర్‌ఎస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ అయినాయని, అందుకు బీజేపీపై కేసీఆర్ చేసిన రెండు నిమిషాల ప్రసంగమే నిదర్శనమన్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణతో పాటు వక్ఫ్ చట్టంపై కేసీఆర్ ఎందుకు నోరు విప్పలేదన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్రపన్ని కాంగ్రెస్ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయన్నారు.

కేటీఆర్, హరీష్‌రావు, కవిత ఆడుతున్న మూడు ముక్కలాటతో కేసీఆర్‌కు మతి భ్రమించిందని, కుటుంబ కొట్లాటతో వేగలేక రజతోత్సవ సభ పేరుతో కేసీఆర్ హంగామా చేసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. వేదికపై కేసీఆర్, కేటీఆర్ ఫ్లెక్సీ మాత్రమే పెట్టడంతో హరీష్‌రావు, కవిత మనసులకి మరోసారి గాయమైందన్నారు.

కేసీఆర్ కుటుంబం అతి తక్కువకాలంలో ఎక్కువ దోచుకున్న కుటుంబమని,  రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో విధ్వంసం చేశారని మహేష్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. పార్టీ పేరులోంచి తెలంగాణ పదాన్ని తొలగించిన కేసీఆర్‌కు ఇప్పుడు జన్మభూమి గుర్తుకు వచ్చిందా? అని ఆయన ప్రవ్నించారు. తెలంగాణ సింటిమెంట్‌ను వాడుకోవడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అన్నారు.