calender_icon.png 13 January, 2025 | 2:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు

13-01-2025 11:19:21 AM

హైదరాబాద్: రైతు పండుగ సంక్రాంతి పర్వదినాల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Former Chief Minister KCR) శుభాకాంక్షలు తెలిపారు. భోగీతో ప్రారంభమై, మకర సంక్రాంతి, కనుమతో మూడు రోజుల పాటు సాగే సంక్రాంతి పండుగ వ్యవసాయాధారిత పల్లె సంస్కృతిలో ప్రత్యేకతను చాటుకుంటుందని పేర్కొన్నారు. పండిన పంటల రాశులతో ఇండ్లు కళకళలాడుతుండగా, రైతు జీవితాల్లో సంక్రాంతి(Sankranti) శోభ నిండుదనాన్ని సంతరించుకుంటుందని తెలిపారు. రంగవల్లులతో, భోగి మంటలతో, గొబ్బెమ్మలతో, గంగిరెద్దుల ఆటలతో, పిల్లలు, పెద్దలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకునే ప్రకృతి పండుగ మకర సంక్రాంతి అని కేసీఆర్(KCR) పేర్కొన్నారు. నూతన తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం పండుగ కావాలని, పాడి పంటలతో రైతు కుటుంబాలు సంతోషంతో నిండాలని, నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు ప్రారంభించిందని చెప్పారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమమే తొలి ప్రాధాన్యతగా నాడు అమలు చేసిన కార్యాచరణ పదేళ్ల అనతికాలంలో సత్ఫలితాలనిచ్చిందని వివరించారు.

అందులో భాగంగా 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్తు, ప్రాజెక్టులు, కాల్వల ద్వారా సాగునీరు, పంటలకు పెట్టుబడిగా రైతుబంధు, రైతు కుటుంబాలకు భరోసాగా రైతు బీమా(Rythu Bheema) వంటి పథకాలను పటిష్టంగా అమలు చేశామని తెలిపారు. తద్వారా సాధించిన వ్యవసాయ ప్రగతి ప్రపంచవ్యాప్తంగా పలు ప్రశంసలు పొందిందని, దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని గుర్తుచేశారు. వ్యవసాయానికి దన్నుగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన కులవృత్తులకు గతంలో లేని విధంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం, ఆర్థిక సహకారం సబ్బండ కులాల జీవితాల్లో సంక్రాంతి శోభ నింపిందని అన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్Bharat Rashtra Samithi) ప్రభుత్వం దాదాపు నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలను వ్యవసాయ రంగఅభివృద్ధికి ఖర్చు చేసిందని వివరించారు. రైతు జీవితాల్లో వెలుగులు నింపాలనే ధృఢసంకల్పంతో ముందుకు సాగామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో దండుగన్న తెలంగాణ వ్యవసాయం (Agriculture of Telangana), బీఆర్‌ఎస్ హయాంలో పండుగలా మారిందని కేసీఆర్ పునరుద్ఘాటించారు. రాజకీయాలకు అతీతంగా రైతన్న సంక్షేమమే ధ్యేయంగా, రాజీపడకుండా పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని నేటి ప్రభుత్వం కొనసాగించాలని సూచించారు. తద్వారా రైతు పండుగ సంక్రాంతి వేడుకలకు వన్నె చేకూర్చినవారమవుతామని అన్నారు. రైతన్నల జీవితాల్లో వెలుగులు కొనసాగాలంటూ ప్రకృతిమాతను ఈ సందర్భంగా ప్రార్థించారు.