12-04-2025 09:46:22 AM
తెలంగాణ, ఒక ప్రపంచ పర్యావరణవేత్తను కోల్పోయింది
హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణే(Environmental protection) ప్రాణంగా బతికిన పద్మశ్రీ వనజీవి రామయ్య(Vanajeevi Ramaiah) మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) విచారం వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. "వృక్షో రక్షతి రక్షితః" అనే నినాదాన్ని తన శరీరంలో భాగం చేసుకుని, కోటికి పైగా మొక్కలను నాటి, ప్రపంచానికి పచ్చదనం ప్రాముఖ్యతను ప్రచారం చేసిన వనజీవి రామయ్య (Padma Shri Vanajeevi Ramaiah) లక్ష్యం మహోన్నతమైనదని కేసీఆర్ పేర్కొన్నారు. మొక్కల పెంపకం కోసం వనజీవిగా మారిన దర్పల్లి రామయ్య జీవితం రేపటి తరాలకు ఆదర్శనీయమని కొనియాడారు.
ప్రపంచ పర్యావరణ కోసం సాగిన మానవ కృషిలో వనజీవిగా వారు చేసిన త్యాగం అసమాన్యమైనదన్నారు. అడవులు, పచ్చదనం అభివృద్ధి దిశగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Government) అమలు చేసిన తెలంగాణకు హరితహారం ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దర్పల్లి రామయ్య అందించిన సహకారం గొప్పదని కేసీఆర్(KCR) గుర్తు చేసుకున్నారు. వనజీవి మరణంతో తెలంగాణ ఒక ప్రపంచ పర్యావరణ వేత్తను కోల్పోయిందని విచారం వ్యక్తం చేసారు. శోకంలో మునిగిన వారి కుటుంబ సభ్యులకు అభిమానులకు పర్యావరణ పరిరక్షకులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు.