calender_icon.png 14 November, 2024 | 12:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ బీ టీంగా కేసీఆర్ అండ్ కో

12-11-2024 01:13:13 AM

  1. అట్టడుగు వర్గాల ప్రయోజనాలకు ఆటంకం
  2. నాడు అణచివేతలు.. నేడు అవాస్తవాల ప్రచారం
  3. బీఆర్‌ఎస్ నేతల తీరుపై మంత్రి సీతక్క ధ్వజం

హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): బీజేపీ బీ టీంగా బీఆర్‌ఎస్ నాయకులు వ్యవహరిస్తున్నారని మంత్రి సీతక్క ధ్వజమెత్తారు.  కేసుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీతో అంటకాగుతున్నార ని మండిపడ్డారు. అట్టడుగు వర్గాల ప్రయోజనాలకు ఆటంకంగా బీఆర్‌ఎస్ మారిందని, అందుకే సమగ్ర కుటుంబ సర్వేకు అడ్డుపడుతుంని విరుచుకుపడ్డారు.

సోమవారం సచివాలయంలో సీతక్క మీడియాతో మాట్లాడారు. కులగణన కోసం వచ్చే అధికారులను నిలదీయాలని కేటీఆర్ పిలుపు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. కులగణన అడ్డుకునేలా వ్యవహరిస్తున్న బీఆర్‌ఎస్‌ను బీసీ సంఘాలు నిలదీయాలని పిలుపునిచ్చారు. విదేశాల నుంచి రప్పించి మరీ బీఆర్‌ఎస్ పార్టీ కుటుంబ సర్వే చేసి.. ప్రజలకు నయా పైసా ప్రయోజనం చేయలేదని గుర్తుచేశారు.

సామాజిక వర్గాల వారీగా జనాభా లెక్క తేలితేనే సంక్షేమ వాటా సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు. క్లబ్బులు, పబ్బులు బంద్ అయ్యాక కొందరు నేతలు అరాచకంగా తయారయ్యారని, విజ్ఞత లేకుండా ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబానికి తప్ప ఎవరికీ లబ్ధి జరగకూడదనే ఇంటింటి సర్వేను బీఆర్‌ఎస్ అడ్డుకుంటుందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

సర్వే వద్దనుకుంటే ఎవరికి నష్టమో ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి పక్కా ప్రణాళికతో బీఆర్‌ఎస్ విష ప్రచారం చేస్తుందని మంత్రి సీతక్క ఆరోపించారు. తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజా ప్రభుత్వంపై విషం చిమ్ముతోందని మండిపడ్డారు. తాము ఇచ్చిన హామీలను నెరవేరుస్తుండటం సహించలేక బీఆర్‌స్ పార్టీ అవాస్తవాలను ప్రచారం చేస్తుందని అన్నారు.

ఐదేళ్ల కాలం కోసం ప్రజలు తమను ఎన్నుకున్నారని, ఐదేళ్లలో ఆరు గ్యారెంటీను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. గూడు లేని పేదలకు కాంగ్రెస్ గత ప్రభుత్వాలు లక్షల ఇండ్లు ఇచ్చాయని, అదే తరహాలో ఇప్పుడు కూడా రూ.5 లక్షలతో ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తుందని స్పష్టంచేశారు.