calender_icon.png 25 October, 2024 | 4:51 AM

ఏప్రిల్ నాటికి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ

25-10-2024 02:02:05 AM

ఏడాదికి 600 రైలు పెట్టెల తయారీ 

  1. వచ్చే నెలలో చర్లపల్లి టెర్మినల్ ప్రారంభం
  2. రాష్ట్ర సహకారం లేకున్నా యాదాద్రికి ఎంఎంటీఎస్
  3. రాష్ట్రంలో ౮౩ వేల కోట్లతో రైల్వే ప్రాజెక్టులు
  4. మరిన్ని వందేభారత్ రైళ్లు ప్రవేశపెడతాం
  5. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి
  6. ద.మ.రైల్వే పరిధిలోని ఎంపీలతో సమావేశం

హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి తెలిపారు. రూ.680 కోట్లతో ఈ కోచ్ ఫ్యాక్టరీ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.

గురువారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో దక్షిణమధ్య రైల్వే పరిధిలోని ఎంపీలతో రైల్వే జీఎం ఏర్పాటు చేసిన సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాజీపేటలో మొదట రూ.521 కోట్లతో వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినా తాము కేంద్రాన్ని కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఒప్పించామని తెలిపారు.

ఈ కోచ్ ఫ్యాక్టరీలో ఎల్‌హెచ్‌బీ (లింక్ హాఫ్‌మన్ బుష్) ఈఎంయు (ఎలక్ట్రిక్ మల్టీఫుల్ యూనిట్) కోచ్‌లను తయారు చేయనున్నట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఏడాదికి 600 కోచ్‌ల తయారీ లక్ష్యంగా ఈ ఫ్యాక్టరీ పనిచేస్తుందని చెప్పారు. ఈ కోచ్ ఫ్యాక్టరీ వల్ల సుమారు మూడువేల మందికి ప్రత్యక్షంగా అనేక మంది కి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.

రాష్ట్రంలో అత్యధికంగా వందేభారత్ రైళ్లు (5) తిరుగుతున్నాయని.. స్లీపర్ వందేభారత్ వచ్చాక వాటిని కూడా తెలంగాణ నుంచి ప్రారంభిస్తామని ప్రకటించారు. కొత్త వందేభారత్ రైళ్లను సైతం తీసుకువస్తామని తెలిపారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ పనులు పూర్తయ్యాయని, అయితే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం అప్రోచ్ రోడ్డు పనులను పూర్తి చేయలేదని చెప్పారు. ఈ పనులు పూర్తి కాకపోయినా వచ్చే నెలలో చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను  ప్రారంభిస్తామని వెల్లడించారు. 

యాదాద్రి వరకు ఎంఎంటీఎస్

ఎంఎంటీఎస్ రైళ్ల నెట్‌వర్క్ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పనిచేయాల్సి ఉంటుందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు సుమారు రూ.700 కోట్లను ఇప్పటి వరకు జమ చేయలేదని కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రం నుంచి సహకారం లేకపోయినా కేంద్రమే సొంతంగా యాదాద్రికి ఎంఎంటీఎస్ రైళ్లను పొడిగిస్తుందని పేర్కొన్నారు. త్వరలో పనులు ప్రారంభి స్తామని చెప్పారు.

ప్రస్తుతం ఘట్కేసర్ వరకు ఎంఎంటీఎస్ రైళ్లు తిరుగుతున్నాయని, అక్కడి నుంచి యాదాద్రి వరకు కొత్తగా ఎంఎంటీఎస్ లైన్ వేసి రైళ్లను ప్రవేశపెడతామని వివరించారు. రూ.650 కోట్ల బడ్జెట్‌తో ఈ పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. చర్లపల్లి టెర్మినల్ నుంచి దూరప్రాంతపు రైళ్లు రాకపోకలు సాగిస్తాయని, అందుకే అక్కడి నుంచి ప్రయాణికులు నగరం నలుమూలలకు వెళ్లేందుకు ఎంఎంటీఎస్ రైళ్లు తిప్పాలని ఆయ అధికారులకు సూచించారు. ఎంఎంటీఎస్ రైళ్లు సమయపాలన పాటించాలని, తాను కూడా ఆ రైళ్లలో ప్రయాణించి తనిఖీ చేస్తానని తెలిపారు. 

రూ.83 వేల కోట్లతో రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు

రాష్ట్రంలో రూ.83 వేల కోట్లతో వివిధ రైల్వే ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు. 15 ప్రాజెక్టులకు సంబంధించి ఫైనల్ లొకేషన్ సర్వే చేసేందుకు రైల్వే బోర్డు నిర్ణయించిందని తెలిపారు. 2,640 కిలోమీటర్ల పరిధిలో పనుల కోసం రూ.50 కోట్లకు వేలకుపైగా ఖర్చు కానుందని చెప్పారు.

౧,౪౫౭ కిలోమీటర్ల రైల్వే డబ్లింగ్, ట్రిప్లింగ్ ప్రాజెక్టులను రూ.17,862 కోట్లతో చేపట్టాల్సి ఉందని అన్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా రాష్ట్రానికి రైల్వే బడ్జెట్‌ను పెంచామని తెలిపారు. తెలంగాణకు చెందిన ఎంపీలంతా తమతమ నియోజకవర్గాల పరిధిలోని రైల్వే ప్రాజెక్టులు, సమస్యలపై ఈ సమావేశంలో జీఎం దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు.

దక్షిణమధ్య రైల్వే పరిధిలో 90 శాతం విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయని అన్నారు. ఎంపీ జీ నగేష్, దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ విలేఖరుల సమావేశంలో పాల్గొన్నారు.