- బీసీల ఉద్యమాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నం
మండిపడిన మంత్రి సీతక్క
హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): బీసీల ఉద్యమాన్ని హైజాక్ చేసేందుకు బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత ప్రయత్నిస్తున్నారని మంత్రి సీతక్క విమర్శించారు. హైదరాబాద్ ఇందిరా పార్క్‌లో జరిగిన బీసీ మహాసభలో కాంగ్రెస్‌పై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క తప్పుబట్టారు. శుక్రవారం సెక్రెటేరియట్‌లో మీడియాతో ఆమె మాట్లాడారు..
అధికారంలో ఉన్నప్పుడు బీసీలపై అహంకారంతో వ్యవహరించి.. ఇప్పుడు మమకారం కురిపిస్తామంటే బీసీలు నమ్మే పరిస్థితి లేదని మండిపడ్డారు. గొర్రెల మందకు తోడేళ్లు కాపలా కాస్తామంటే ఎలా? అని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్న పదేళ్లు కవితకు బీసీలు గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు.
కేంద్రంలో, రాష్ర్టంలో విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని చెప్పారు. ఎన్నడూ లేని విధంగా సమగ్ర కుల గణన చేపట్టింది కూ డా తమ ప్రభుత్వమేనన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచేం దుకు న్యాయ నిపుణులు, మేధావులతో చర్చిస్తున్నామని తెలిపారు. బీసీ ముసుగుతో కవిత మరో కొత్త డ్రామా మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ బీసీ మం త్రులకు కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు.