పసుపు రైతుల కోసం సుతిలి, దబ్బనం కూడా కవిత ఇయ్యలే
ప్రోటోకాల్ గురించి కవిత మాట్లాడం హాస్యాస్పదం
కవితపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి
నిజామాబాద్ (విజయక్రాంతి): ఎమ్మెల్సీ కవితకు లిక్కర్ మీద ఉన్న శ్రద్ధ పసుపు రైతుల మీద లేదని, నిజామాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... పసుపు రైతుల కోసం అలుపెరుగని పోరాటం చేశానన్న కవిత మాట్లాడిన మాటలు వింటుంటే ప్రజలు, పాత్రికేయలే కాకుండా బిఆర్ఎస్ నాయకుల సైతం నవ్వుకుంటున్నారన్నారు. ఆమె తీహార్ జైలుకు సైతం పసుపు బోర్డు సాధన కొరకే వెళ్లినట్టు చెప్పుకుందన్నారు. కవిత త్రిముఖ వ్యూహం గురించి మాట్లాడుతుందని, వాళ్ల కుటుంబ త్రిముఖ వ్యూహం ఏందో ప్రజలందరికీ తెలుసన్నారు. ఆస్తులు కూడబెట్టడం, ప్రజలను హింసించడం, ప్రతిపక్షాలని బెదిరించడం, ఇవే వారి అసలు త్రిముఖ వ్యూహాలన్నారు. ప్రతీ మూడేళ్లకోసారి పసుపు ధర పెరుగుతుందని, అందులో ఎంపీ అర్వింద్ గొప్పతనం ఏమీ లేదని కవిత అన్నారని, మరి కవిత ఐదేళ్లు ఎంపీగా ఉన్నప్పుడు పసుపు ధర ఎందుకు పెరగలేదన్నారు.
కవితకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం పసుపు రైతుల కొరకు వేల్పూర్ లో స్పైసెస్ పార్క్ కొరకు 42 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినప్పుడు, కనీసం ఒక వ్యవసాయాధార పరిశ్రమని కూడా ఎందుకు తేలేకపోయారనని ప్రశ్నించారు. కేవలం మీ కమీషన్లకు భయబడే పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్లిపోయారన్నారు. ప్రపంచానికి యోగా నేర్పిన రాందేవ్ బాబాని కూడా భయపెట్టిన చరిత్ర కవితదన్నారు. పసుపు శుద్ధి కర్మాగారాలు పెట్టాలంటే, అక్కడున్న అప్పటి ఎంపీ కవితకి ఆత్మశుద్ధి కావాలని రాందేవ్ బాబా తన శిష్యులతో అన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పసుపు రైతుల గురించి పలువురిని కలిశానని కవిత గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ పసుపు బోర్డుని సాధించిన తమ నాయకుడు ఏనాడు కూడా తన గొప్పదనం అని పేర్కొనలేదని అన్నారు.
పసుపు రైతుల కొరకు కవిత కనీసం సుతిలి, దబ్బనం కూడా ఇవ్వలేదని, కానీ తమ నాయకుడు మాత్రం వందల సంఖ్యలో బాయిలర్లు, పాలిషర్లు, వేల సంఖ్యలో టార్పాలిన్ షీట్లు అందించారన్నారు. తాను పోరాటం చేస్తున్నప్పుడు అరవింద్ కు రాజకీయాలు కూడా తెలియవని కవిత అంటున్నారని, ఆమె తండ్రి కేసీఆర్ కి రాజకీయ జీవితం ఇచ్చిన డి.శ్రీనివాస్ కుమారుడైన అరవింద్ కు రాజకీయాలు తెలియవా అని ప్రశ్నించారు. ప్రోటోకాల్ గురించి కవిత మాట్లాడడం విడ్డూరంగా ఉందని, 10 సంవత్సరాల టి(బీ)ఆర్ఎస్ నాయకులు ఏనాడైనా ప్రోటోకాల్ పాటించారా? అని అంటూనే, ప్రధాని మోడీ రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా మీ తండ్రి కేసిఆర్ ఫామ్ హౌస్ లో పడుకున్నారన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు ప్రవళిక, మెట్టు విజయ్, సుక్క మధు, సుధీర్, ఇందిరా, వనిత, బైకాన్ సుధా, సుమిత్ర, ఆకుల హేమలత, సాయి వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.