- బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ
- ఆమె బలహీనమైన మహిళ కాదని ధర్మాసనం వ్యాఖ్యలు
- ప్రతివాదుల వాదనలు విన్నాకే నిర్ణయిస్తామని వెల్లడి
- తదుపరి విచారణ ఆగస్టు 20కి వాయిదా
న్యూఢిల్లీ, ఆగస్టు 12: ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ, సీబీఐ కేసుల్లో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం నిరాకరించింది. ప్రతివాదుల వాదనలు వినకుండా బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రతివాదులుగా ఉన్న ఈడీ, సీబీఐలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే వెంటనే విచారణ చేపట్టాలని కవిత తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ కోరారు.
గత 5 నెలలుగా కవిత తీహార్ జైలులోనే ఉన్నారని తెలిపారు. ఈడీ, సీబీఐ కేసుల్లో చార్జిషీట్లు దాఖలయ్యాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన మనీశ్ సిసోడియా, ప్రబీర్ పుర్కాయస్థ, అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ లభించిందని, కవిత విషయంలో బెయిల్‌ను నిరాకరిస్తున్నారని రోహత్గీ వాదించారు. పీఎంఎల్‌ఏ చట్టంలోని సెక్షన్ 45 ప్రకారం మహిళగా ఆమెకు బెయిల్ ఇచ్చే అవకాశముందని ధర్మాసనానికి విన్నవించారు.
బలహీనమైన మహిళ కాదు
అనంతరం జస్టిస్ గవాయి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవిత చదువుకున్న మహిళ అని, ఓ రాజకీయ నాయకురాలని ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. అంతేకాకుండా ఆమె బలహీనమైన మహిళ కాదని చెప్పారు. ఏదేమైనా ప్రతివాదుల వాదనలు వినకుండా బెయిల్ మంజూరు చేయలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసుపై వచ్చే సోమవారంలోపు విచారించాలని రోహత్గీ విజ్ఞప్తి చేశారు. కానీ అందుకు అంగీకరించని న్యాయస్థానం ఈ నెల 20కి విచారణ వాయిదా వేసింది.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవితను ఈ ఏడాది మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం కోర్టు అనుమతితో విచారణ కోసం సీబీఐ కస్టడీలోకి తీసుకుంది. బెయిల్ కోసం కవిత ప్రయత్నించగా ట్రయల్ కోర్టు తిరస్కరించగా తర్వాత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. జూలై 1న బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో కవిత అప్పీల్ చేశారు.