calender_icon.png 4 February, 2025 | 4:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సికింద్రాబాద్‌లో కవచ్ సెంటర్

04-02-2025 01:23:12 AM

  1. త్వరలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభం
  2. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి

హైదరాబాద్, ఫిబ్రవరి3 (విజయక్రాంతి): సికింద్రాబాద్‌లో కవచ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తామని, త్వరలో కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. రైల్వేబడ్జెట్‌పై సోమవారం ఆయన ఢిల్లీ నుంచి రైల్వేశాఖ ఉన్నతాధికారులో వర్చువల్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పద్దులో తెలంగాణకు రికార్డు స్థాయిలో బడ్జెట్ కేటాయించామని, 2009 మధ్య ఉమ్మడి ఏపీకి సగటున రూ.886 కోట్ల కేటాయింపులు ఉండేవని గుర్తుచేశారు. ఆ కేటాయింపులతో పోలిస్తే, తెలంగాణకు ఇప్పుడు బడ్జెట్ ఆరింతల బడ్జెట్ కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణలో రూ.41,677 కోట్లతో రైల్వే అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.

రాష్ట్ర పరిధిలోని రైల్వే నెట్‌వర్క్‌ను 100 శాతం విద్యుద్దీకరణ చేశామని వెల్లడించారు. ‘కవచ్’ ఇన్‌స్టాలేషన్‌లోనూ రాష్ట్రం ముందంజలో ఉందని వివరించారు. సికింద్రాబాద్‌లో కవచ్ అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటిం చారు. ఇప్పటివరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 1,465 కిమీ మేర కవచ్ ఇన్‌స్టాలేషన్ పూర్తయిందని, ప్రస్తుతం ట్రయల్స్ జరుగుతున్నాయన్నారు.

రాబోయే ఆరేళ్లలో దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం రైల్ నెట్‌వర్క్‌కు ఇన్‌స్టాల్ చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలోని ఏడు జిల్లాల నుంచి తొమ్మి ది స్టాప్‌లతో ఐదు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని, అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రాష్ట్రంలో త్వరలో 40 రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

దేశవ్యాప్తంగా 7,000 కిమీ మేర పాత రైల్వే ట్రాక్‌లను పునరుద్ధరిస్తామని, ముఖ్యమైన రైల్వేమార్గాల్లో గంటలకు 160 కిమీ వేగంతో రైళ్లు నడిపేందుకు రైల్వేట్రాక్‌లను అప్‌గ్రేడ్ చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే కొన్ని రైల్వేలైన్లకు గంటకు 130 కిమీ వేగం తో నడిచే సామర్థ్యం ఉందని, మొత్తం నెట్‌వర్క్‌కు కూడా గంటకు 100 కిమీ వేగంతో రైళ్లు నడుపగల సామర్థ్యం ఉందని వెల్లడించారు.

దేశవ్యాప్తంగా త్వరలో 50 నమో భారత్ రైళ్లు, 200 వందేభారత్ రైళ్లు, 100 అమృత్ భారత్ రైళ్లు నడిపిస్తామన్నారు. సమావేశానికి దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ సైతం హాజరయ్యారు.

మళ్లీ నిరాశే !  

  1. రైల్వేబడ్జెట్‌లోనూ ఏపీకే కేంద్రం పెద్దపీట
  2. తెలంగాణకు రూ.5,337 కోట్లు..
  3. ఏపీకి రూ.9,417 కోట్ల కేటాయింపులు
  4. తెలంగాణపై స్పష్టంగా కనిపిస్తున్న వివక్ష

హైదరాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బడ్జెట్‌లో రాష్ట్రానికి పైసా విదిల్చలేదు. కనీసం పద్దులో ‘తెలంగాణ’ అన్న పదం కనిపించలేదు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలోనా ‘తెలంగాణ’ ప్రస్తావనే లేదు. ఇదంతా మరవకముందే కేంద్రం మరోసారి రాష్ట్రంపై వివక్ష చూపింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ను అందలం ఎక్కించి, తెలంగాణకు మొండిచేయి చూపింది. మొత్తం రైల్వే బడ్జెట్ రూ.2.55 లక్షల కోట్లు కాగా, దానిలో ఏపీకి రూ.9,417 కోట్లను కేటాయించింది. తెలంగాణకు రూ.5,337 కోట్లు మాత్రమే కేటాయించి వివక్ష చూపింది. వరుసగా రెండు రైల్వేబడ్జెట్లలోనూ ఏపీకే కేటాయింపులు దక్కడం గమనార్హం.

గతంతో పోలిస్తే తెలంగాణకు భారీగానే బడ్జెట్ కేటాయించామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్తున్నప్పటికీ రైల్వేరంగ నిపుణులు మాత్రం ఇది స్పష్టమైన వివక్షేనని అభిప్రాయపడుతున్నారు. గతేడాది బడ్జెట్‌తో పోలిస్తే తెలంగాణకు సరిగ్గా పెంచింది రూ.కోటి మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. ఏపీకి మాత్రం గతేడాది కంటే రూ.266 కోట్లు అధికంగా కేటాయించారని వెల్లడిస్తున్నారు.

తెలంగాణవ్యాప్తంగా రూ.41,677 కోట్ల విలువైన రైల్వే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కేంద్ర రైల్వే మంత్రి చెప్తున్నారని, ఏపీలో మాత్రం అంతకు డబుల్.. అంటే అక్షరాలా రూ.84,559 కోట్ల విలువైన పనులు చేపడుతుండడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు