calender_icon.png 13 January, 2025 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కౌశిక్‌రెడ్డి x డా. సంజయ్

13-01-2025 02:17:36 AM

  1. మంత్రుల ఎదుటే ఎమ్మెల్యేల ఘర్షణ
  2. జగిత్యాల ఎమ్మెల్యేను నెట్టేసిన పాడి కౌశిక్‌రెడ్డి
  3. కరీంనగర్ కలెక్టరేట్‌లో తీవ్ర ఉద్రిక్తత 
  4. కౌశిక్‌రెడ్డిని బయటకు తరలించిన పోలీసులు
  5. చర్యలు తప్పవని మంత్రి శ్రీధర్‌బాబు హెచ్చరిక
  6. రసాభాసగా ఉమ్మడి కరీంనగర్ సమీక్ష సమావేశం

కరీంనగర్, జనవరి 12 (విజయక్రాంతి): ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి సమీక్ష సమావేశం రసాభాసగా మారిం ది. చాలా నెలల తర్వాత ఆదివారం సాయంత్రం జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా సమీక్ష సామావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశం ప్రారంభం కాగానే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమస్యలపై ఎమ్మెల్యేలను మాట్లాడమని సూచించారు.

తొలుత బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డిలు మాట్లాడారు. అనంతరం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడేందుకు మైక్ తీసుకోగా, కౌశిక్‌రెడ్డి ఆయనను అడ్డుకున్నా రు. ఏ పార్టీ సభ్యునిగా మాట్లాడుతున్నా వో చెప్పాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే సంజయ్‌తో వాగ్వాదానికి దిగారు.

ఈ క్రమంలో మైక్ లాక్కొనేందుకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా సమావేశం రసాభాసాగా మారింది. ఈ క్రమంలో తాను కాంగ్రెస్ పార్టీ వాడినంటూ ఎమ్మెల్యే సంజయ్ చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరింది. ఇద్దరు నెట్టివేసుకునేవరకు వెళ్లింది. ఈక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పందించారు.

కౌశిక్‌రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రౌడీయిజం మంచిది కాదని, సమస్యలుంటే సమీక్షా సమావేశంలో చర్చించాలి తప్ప ఇలా వ్యవహరించడం ఏమిటని మండిపడ్డారు. ఇలా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశం రసాభాసాగా మారడంతో స్పెషల్ పార్టీ పోలీసులు వచ్చి కౌశిక్‌రెడ్డిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఆయనతోపాటు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ బయటకు వచ్చారు. 

సంజయ్‌కి ఎమ్మెల్యే పదవి కేసీఆర్ బిక్ష : కౌశిక్‌రెడ్డి

అనంతరం పాడి కౌశిక్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సంజయ్‌కి ఎమ్మెల్యే పదవి కేసీఆర్ పెట్టిన బిక్ష అని, మగాడైతే ఆ పదవికి రాజీనామా చేసి మళ్లీ బరిలో దిగాలని సంజయ్‌కి సవాల్ విసిరారు. డాక్టర్ సంజయ్‌తోపాటు పార్టీ మారిన అందరినీ అడ్డుకుంటామని హెచ్చరించారు. కేవలం పబ్లిసిటీ కోసమే కౌశిక్‌రెడ్డి హంగామా చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు.

మానకొండూర్ ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి వ్యవహారశైలి మార్చుకోవాలని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. కౌశిక్ రెడ్డి తీరును బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కౌశిక్‌రెడ్డి వైఖరిపైన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు.

రౌడీయిజం, గుండాయిజం చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని తీవ్రంగా మందలించారు. అభివృద్ధి, సంక్షేమ పరమైన సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామని స్పష్టంచేశారు. అనంతరం ఎమ్మెల్యే సంజయ్ స్పందిస్తూ.. తాను ప్రజల సంక్షేమం కోసం, జగిత్యాల అభివృద్ధి కోసం పార్టీ మారానని, కాంగ్రెస్‌లోనే ఉన్నానని స్పష్టంచేశారు. సమావేశం వాడివేడిగా ప్రారంభం కావడంతో తదనంతరం పోలీసుల పహారా మధ్య కొనసాగింది.