ఆయన్ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలి
మహిళా కమిషన్ విచారణకు పిలవాలి
మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ శోభారాణి
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయ క్రాంతి): బీఆర్‌ఎస్ వీడిన ఎమ్మెల్యేలకు చీరె, గాజులు పంపుతున్నామని మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఎమ్మె ల్యే కౌశిక్‌రెడ్డికి చెప్పు దెబ్బలు తప్పవని రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ శోభారాణి మండిపడ్డారు. కౌశిక్‌రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, బేషరతుగా మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో బుధవారం మీడియా సమావే శంలో ఆమె మాట్లాడారు.
మహిళలను కించపరిచేలా బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడడం కుసంస్కారమని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో మహిళలు కూడా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్న వేళ, వారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. కౌశిక్‌రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుని విచారణకు పిలవాలని డిమాండ్ చేశారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ కాల్వ సుజాత మాట్లాడుతూ.. కేటీఆర్ కూడా ఇటీవల మహిళలను కించపరుస్తూ మాట్లాడారని, ఆయన బాటలోనే కౌశిక్‌రెడ్డి కూడా నడుస్తున్నారని మండిపడ్డారు.
మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలు
- సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి
మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలున్నాయని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి బుధవారం ఓ ప్రకటనలో అభ్యంతరం వ్యక్తం చేశారు. మతిస్థిమితం కోల్పోయి ఇలాంటి అనారికమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.