కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించిన కరీంనగర్ ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి(MLA Kaushik Reddy) డాక్టర్ సంజయ్(MLA Sanjay Kumar) మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వాగ్వాదం కాస్త ముదిరి ఇద్దరు ఎమ్మెల్యేలూ పరస్పరం చేయి చేసుకున్నారు. జిల్లా సమీక్షా సమావేశంలో ప్రభుత్వ పథకాలపై చర్చ జరిగింది. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్(Minister Uttam Kumar Reddy) రెడ్డి పర్యటన సందర్భంగా జిల్లా సమీక్షా సమావేశంలో ప్రభుత్వ పథకాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడారు. దీంతో ఆగ్రహానికి గురైన కౌశిక్ రెడ్డి నువ్వు ఏ పార్టీ అంటూ సంజయ్‌ను ప్రశ్నించారు. దమ్ముంటే కాంగ్రెస్ టికెట్‌పై గెలవాలని సవాల్ చేశారు. ఇద్దరి మధ్య వాగ్వాదం చేయి చేసుకునే దాక వెళ్లడంతో కలెక్టరేట్ నుంచి కౌశిక్ రెడ్డిని పోలీసులు బలవంతంగా బయటకు పంపించారు. కాగా, బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్ పార్టీకి సపోర్టుకు మాట్లాడడం ఏంటని కౌశిక్ రెడ్డి మండిపడుతున్నారు. మరోవైపు కౌశిక్ రెడ్డి ఎక్కడుంటే అక్కడ వివాదాలు ఉంటాయని కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.