calender_icon.png 26 November, 2024 | 6:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అస్వస్థతతో కస్తూర్భా విద్యార్థిని మృతి

26-11-2024 01:38:44 AM

సిబ్బంది నిర్లక్ష్యమే కారణం: తల్లిదండ్రులు

హుజూరాబాద్, నవంబరు 24 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట కస్తూర్భా పాఠశాల పదవ తరగతి విద్యార్థిని అస్వస్థతకు గురై ఆదివారం మృతిచెందింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ముల్కలపల్లి గ్రామానికి చెందిన రవి, ఇందిర దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు. కూతురు నిత్యశ్రీ(16)ని కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని కస్తూ ర్భా పాఠశాలలో పదవ తరగతి చదివిస్తున్నారు.

హాస్టల్‌లో ఉన్న నిత్యశ్రీ ఈ నెల 17న అస్వవస్థతకు గురైంది. హాస్టల్ సిబ్బంది తల్లిదండ్రులకు విషయం తెలుపడంతో వారు హాస్టల్‌కు వెళ్లి నిత్యశ్రీని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. కోలుకున్న తర్వాత తిరిగి హాస్టల్‌కు పంపించారు. ఆ తర్వాత హాస్టల్‌లో నిత్యశ్రీ మళ్లీ అనారోగ్యానికి గురైనా ఉపాధ్యాయురాలు అనూష, ఏఎన్‌ఎం ప్రభావతి పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. నిత్యశ్రీ పరిస్థితి విషమంగా మారిన తర్వాత స్పందించిన సిబ్బంది ఈ నెల 21న తమకు సమాచారం ఇచ్చారని వారు పేర్కొన్నారు.

సమాచారం అందిన వెంటనే హాస్టల్‌కు వెళ్లి నిత్యశ్రీని హనుమకొండ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిత్యశ్రీ ఆదివారం మృతిచెందినట్లు తెలిపారు. తమ కూతురు చావుకు ఉపాధ్యాయురాలు అనూష, ఏఎన్‌ఎం కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవి తెలిపారు. విద్యార్థిని మృతి చెందిన విషయం తెలుసుకున్న డీఈవో జనార్ధన్‌రావు పాఠశాలకు వెళ్లి, వివరాల నివేదికను కలెక్టర్‌కు అందజేయనున్నట్లు తెలిపారు.