19-03-2025 06:30:45 PM
646 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి రికార్డ్..
అభినందించిన గని మేనేజర్ లక్ష్మీనారాయణ..
మందమర్రి (విజయక్రాంతి): ఏరియాలోని కాసిపేట్-2 గని చరిత్రలో మరో సువర్ణ అధ్యాయాన్ని లిఖించి ఓకె రోజు 646 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి అరుదైన రికార్డును సృష్టించారు కాసీపేట 2 గని కార్మికులు. మంగళవారం ఒక్కరోజే గనిలో 646 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించడం ద్వారా ఉత్పత్తి మైలురాయిలో మరో అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాకుండా గని చరిత్రలోనే అరుదైన బొగ్గు ఉత్పత్తి చరిత్రను తిరగరాశారు గని కార్మికులు. గని చరిత్రలోనే అద్భుతమైన రికార్డు బొగ్గు ఉత్పత్తిని సాధించి అరుదైన రికార్డు సృష్టించిన గని కార్మికులను గని మేనేజర్ జి లక్ష్మీనారాయణ అభినందించారు. బుదవారం గనిపై ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
కార్మికులు, అధికారులు, సూపర్ వైజర్ల కృషి, సామూహిక శక్తి, అంకితభావానికి నిలువుటద్దం ఈ రికార్డ్ అని ఆన్నారు. అరుదైన మైలురాయిని అందుకోవడంలో కార్మికులు, అధికారుల పట్టుదల, ప్రణాళిక, సంకల్పబలం అందరికీ స్పూర్తిదాయకం ఆన్నారు. సమిష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందని ఆయన స్పష్టం చేశారు. ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని, మరింత ఉన్నతమైన లక్ష్యాలను చేరుకునేందుకు ముందుకు సాగుదామని, కలసి కృషి చేస్తే, ప్రతి కల సాకారం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరిన్ని చరిత్రాత్మక విజయాలను సాధించడానికి కార్మికులు సిద్ధంగా ఉండాలని కోరారు. అద్భుత విజయంలో భాగమైన ఆధికారులకు, సూపర్వైజర్లకు, టెక్నీషియన్లకు, ఉద్యోగులకు, యూనియన్ నాయకులకు ఆయన అభినందనలు తెలిపారు.