calender_icon.png 13 March, 2025 | 3:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కశ్మీర్ భారత్ అంతర్గత వ్యవహారం

07-07-2024 02:04:21 AM

  1. అది భారత్-పాక్ ద్వైపాక్షిక అంశం
  2. వారే శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
  3. బ్రిటన్ ఎలాంటి జోక్యం చేసుకోదు
  4. ఆ దేశ నూతన ప్రధాని కెయిర్ స్టార్మర్

లండన్, జూలై 6: బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో విజయం సాధించిన లేబర్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ఆదేశ ప్రధాని కెయిర్ స్టార్మర్ తన తొలి ప్రసంగంలో భారతదేశంలోని కశ్మీర్ సమస్యపై తన వైఖరిని స్పష్టం చేశారు. శనివారం ఆయన ఓ ప్రసంగంలో మాట్లాడుతూ.. కశ్మీర్ సమస్య భారత అంతర్గత వ్యవహారం. అది ఆ దేశ పార్లమెంట్, రాజ్యాంగం పరిధిలోని అంశం. భారత్ ద్వైపాక్షిక అంశమైన కశ్మీర్ సమస్యను ఇరుదేశాలు శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. 

కశ్మీర్ సమస్యపై బ్రిటన్ ఎలాంటి జోక్యం చేసుకోదు అని స్పష్టం చేశారు. బ్రిటన్‌లో భారత సంతతికి చెందినవారు పెద్ద సంఖ్యలో ఉండటంతో ఎన్నికల ముందే లేబర్ పార్టీ ఒక స్పష్టమైన వైఖరితో ముందుకెళ్లింది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న, బలమైన ఆర్థిక వ్యవస్థతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా తన మేనిఫెస్టోలో భారత దేశంతో మంచి సంబంధాలు కోరుకుంటున్నామని, ఆ దేశ పౌరులు బ్రిటన్‌లో స్వేచ్ఛగా జీవించడం, ఉద్యోగాలు చేసుకోవడం వంటివి చేయవచ్చని పొందుపర్చారు. భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం, వాణిజ్య ఒప్పందాలు, సాంకేతిక భద్రత, విద్య, వైద్యం తదితర అంశాలపై పరస్పర సహకారం కోరుకుంటున్నామని లేబర్ పార్టీ స్పష్టం చేసింది. 

గతంలో కశ్మీర్ తీర్మానంపై అభ్యంతరాలు..

గతంలో కశ్మీర్‌పై లేబర్ పార్టీ వైఖరి ప్రస్తుతానికి పూర్తి భిన్నంగా ఉండేది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు జెరెమీ కార్బిన్ నేతృత్వంలోని లేబర్ పార్టీ సెప్టెంబర్ 2019లో కశ్మీర్ అంశంపై అత్యవసర తీర్మానం ఆమోదించింది. అంతర్జాతీయ పరిశీలకు కశ్మీర్‌లో పర్యటించి అక్కడి ప్రజలకు స్వయం నిర్ణయాధికారం కల్పించాలని డిమాండ్ చేసింది. ఈ తీర్మానంపై అప్టట్లో భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.  ఇదంతా ఓటుబ్యాంకు రాజకీయం కోసం లేబర్ పార్టీ ఆడుతున్న నాటకం అని, మా దేశ వ్యవహారాల్లో మీ జోక్యం అనవసరం అని ఘాటుగా జవాబుచ్చింది.