calender_icon.png 21 December, 2024 | 6:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భావోద్వేగాల చుట్టూ కశ్మీర్ ఎన్నికలు

29-09-2024 12:00:00 AM

ఐ.వి.మురళీకృష్ణ శర్మ :

ఉద్రిక్తతలతో నిత్యం వార్తల్లో నిలిచే జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు అంచనాలకు భిన్నంగా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు విడతలను పూర్తి చేసుకొని తుది మూడో దశకు ఎన్నికల ప్రక్రియ చేరుకుంటున్న వేళ రాజకీయాలు మాత్రం వేడెకుతున్నాయి.

జమ్మూ ప్రాంతంలో, కశ్మీర్ ప్రాంతంలో భిన్నమైన రాజకీయ వాతావరణం ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రచారాలు, ప్రణాళికలు, అంచనా లు రెండు ప్రాంతాలలో వేర్వేరుగా ఉంటున్నాయి. 90 స్థానాలున్న జమ్మూ కశ్మీర్‌లో మ్యాజిక్ ఫిగర్ 46 సీట్లను సాధించడమే లక్ష్యంగా ప్రాంతాలను బట్టి జాతీయ, ప్రాంతీయ పార్టీల వ్యూహాలు, ప్రతివ్యూహా లు ఎప్పటికప్పుడు మారుతున్నాయి.

జమ్మూ కశ్మీర్ ఎన్నికలను అంచనా వేయడానికి పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ బృం దం క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు చివ రి దశ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు భావోద్వేగాలకు పెద్దపీట వేస్తున్నట్టు స్పష్టంగా కనిపించింది.

చివరి దశలో మారిన ప్రచార శైలి

మూడు దశలలో భాగంగా 24 నియోజకవర్గాల్లో జరిగిన మొదటి విడతలో 61 శాతానికి పైగా, 26 నియోజకవర్గాల్లో జరిగిన రెండో విడతలో 57 శాతానికిపైగా ఓటింగ్ నమోదైంది. అక్టోబర్ 1వ తేదీన మూడో విడత ఎన్నికలు జరగన్న నేపథ్యం లో పార్టీల ప్రచార శైలి మారుతున్నది. పార్టీల ఎన్నికల అంశాలు కూడా మారుతున్నాయి. ముఖ్యంగా జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల మధ్య ఈ విషయంలో తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

జాతీ య పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలైన జేకేఎన్‌సీ, జేకేపీడీపీ, ఏఐపీ ప్రచారాంశాలు మారుతున్నాయి. కశ్మీర్ లోయలో ముస్లిం ఓటర్లు 90 శాతానికి పైగా ఉంటారు. జమ్మూలో హిందూ ఓట ర్లు 65 శాతానికి పైగా, ముస్లిం ఓటర్లు 30 శాతానికి పైగా ఉంటారు. దీంతో జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో మత ప్రభావం కీలకంగా మారడంతో ముస్లింల ఆధిపత్యం ఉండే కశ్మీర్‌లో బీజేపీకి ఒక్క సీటు కూడా రావ డం గగనమే.

మరోవైపు హిందువులు అధికంగా ఉండే జమ్మూలో బీజేపీ ఆధిపత్యం కనిపిస్తున్నా కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తున్నది. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం కశ్మీర్ ప్రాంతంలో 47, జమ్మూలో 43 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. రెండు విడతల లో ఎన్నికలు పూర్తయిన 50 స్థానాల్లో కశ్మీర్‌లో 31, జమ్మూలో 19 సీట్లున్నాయి. చివరి విడత ఎన్నికలు జరగనున్న 40 స్థానాల్లో జమ్మూలో 24, కశ్మీర్‌లో16 సీట్లున్నాయి.

ఆర్టికల్ 370, రాష్ట్ర హోదానే కీలకం

జమ్మూ కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే 370 ఆర్టికల్‌ను 2019 ఆగస్టులో నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేయడం, రాష్ట్ర హోదాను తొలగించి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడం అంశాలు అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా మారాయి. కశ్మీరీలకు అన్యాయం చేస్తూ తొలగించిన ఆర్టికల్ 370ను పునరుద్ధరిస్తామని జేకేఎన్‌సీ, జేకేపీడీపీ, ఏఐపీ వంటి ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో ప్రధాన అంశంగా ప్రచారం చేస్తుంటే జాతీయ పార్టీల వైఖరి భిన్నంగా ఉంది.

రద్దైన ఆర్టికల్ 370ను మళ్లీ తీసుకురావడం అసాధ్యమంటున్న బీజేపీ కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టాలని చూస్తున్న ది. 370 ఆర్టికల్‌పై కాంగ్రెస్ మిత్రపక్షమైన జేకేఎన్‌సీ నిర్ణయంపై కాంగ్రెస్ స్పందించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. ఇప్పటివ రకు కశ్మీర్ వ్యాలీలోని అధిక స్థానాల్లో ఎన్నికలు జరగడంతో కశ్మీరీలకు న్యాయం చేస్తామంటూ చెబుతూ వచ్చిన కాంగ్రెస్, 370 ఆర్టికల్ పునరుద్ధరణపై స్పష్టత ఇవ్వకుండా ఆచితూచి వ్యవహరించింది.

మూడో విడతలో 24 స్థానాలున్న జమ్మూ లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉండడంతో కాంగ్రెస్ లక్ష్యంగా 370 ఆర్టికల్‌పై మరింత జోరు పెంచాలని బీజేపీ భావిస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మొదలుకొని అమిత్ షా, రాజనాథ్ సింగ్, నడ్డా వంటి బీజేపీ అగ్రనేతలంతా దీన్నే ప్రచార అస్త్రంగా మార్చుకున్నారు. 

జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను తొలగించి కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడం అసెంబ్లీ ఎన్నికల్లో  మరో ప్రధానాంశంగా మారింది. అంతేకాక లెఫ్టినెంట్ గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు కట్టబెడుతూ ఇటీవల కేంద్రం నిర్ణయం తీసుకుంది. పరిస్థితులు చక్కబడగానే రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని చెప్పిన మోదీ సర్కారు ఐదేళ్లు అయినా చర్యలు తీసుకోలేదు.

పైగా గవర్నర్‌కు అదనపు అధికార పగ్గాలు కట్టబెట్ట డంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఈ రెండు అంశాలను బీజేపీయేతర పార్టీలు ప్రధాన ప్రచారాస్త్రాలుగా మార్చుకున్నా యి. ప్రాంతీయ పార్టీలతో పాటు కాంగ్రెస్ కూడా మోదీ ప్రభుత్వం మాట తప్పిందని, తాము అధికారంలోకి రాగానే జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను కల్పించడమే ప్రథమ కర్తవ్యమని ప్రచారం చేస్తున్నది.

బీజేపీపై ప్రజాగ్రహం

రాష్ట్ర హోదాను తొలగించడంతో కశ్మీర్ వ్యాలీతో పాటు జమ్మూలో కూడా బీజేపీపై ప్రజాగ్రహం ఉంది. కేంద్ర పాలిత ప్రాంతంతో రాష్ట్రానికి ఇదివరకున్న  ప్రత్యే క హక్కులు ఇకపై ఉండవని, గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు అప్పగించడంతో రాష్ట్ర ప్రభుత్వం కంటే కేంద్ర పెత్తనమే అధికంగా ఉంటుందని, ఆరు నెలలకో మారు రాజధానిని మార్చే ‘దర్బార్’ కూడా లేకుం డా పోయిందని, దీంతో ఆర్థికంగా నష్ట పోతున్నామనే అసంతృప్తి జమ్మూ ప్రాం త ప్రజల్లో ఉందని పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ పరిశీలనలో కనిపించింది.

అన్ని పార్టీలు ఈ అంశాన్ని ఎత్తుకోవడం, ప్రజల్లో కూడా దీనిపై ఆగ్రహం ఉందని గమనించిన బీజేపీ రాష్ట్ర హోదా కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుందని, ఎన్నికల అనంతరం రాష్ట్రానికి హోదా కల్పిస్తామని ఎన్నికల సందర్భంగా చెబుతోంది. జమ్మూ కశ్మీర్ ఎన్నికలు కేంద్ర పాలిత ప్రాంతంలో కాకుండా రాష్ట్ర హోదాలో జరుగుతాయని ఆశించామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రచారం చేస్తూ దీనిపై బీజేపీకి ఏమాత్రం అవకాశమివ్వకుండా ఆ పార్టీని ఇరుకున పెడుతున్నారు. రాష్ట్ర హోదా అంశం ఇతర పార్టీలకు కీలకాస్త్రంగా మారగా, బీజేపీకి నష్టం చేకూ ర్చేలా ఉంది.

జైల్లో ఉన్న వేర్పాటువాద సానుభూతిపరులు, యువకుల విడుదల, వారిపై ఉన్న కేసులను ఉపసంహరిస్తామని, మిలిటెంట్లకు సహాయ సహకారాలు అంది స్తున్నారనే నెపంతో ప్రయోగించే చట్ట విరుద్ద కార్యకలాపాల (నివారణ) చట్టాలని తొలగిస్తామని, పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ (సీఎస్‌ఏ) చట్టంతో స్థానికులను అరెస్ట్ చే యడాన్ని ఆపుతామని ప్రాంతీయ పార్టీలు హామీలుగా ప్రకటిస్తున్నాయి.

వీటితో పాటు పాకిస్తాన్‌తో  చర్చలు జరిపేలా కృషి చేస్తామని చెబుతున్నాయి. వేర్పాటు వాదులు, పాకిస్తాన్ అంశాలకు సంబంధించి ప్రాంతీయ పార్టీలు వ్యాఖ్యానిస్తున్నా జాతీయ పార్టీలు భిన్నంగా ప్రచారం చేస్తున్నాయి. తుది విడ త ఎన్నికల్లో జమ్మూలో అధిక స్థానాలు ఉండడంతో బీజేపీ ఈ అంశాలను ప్రచారాస్త్రంగా మార్చుకుం టూ ప్రత్యర్థులు పాకిస్తాన్ సానుభూతి పరులని, ఆ దేశం పాట పాడుతున్నారని చెబుతూ లబ్ధి పొందాలని చూస్తున్నది.  

జమ్మూ కశ్మీర్‌లో గత ఎన్నికలను పరిశీలిస్తే కశ్మీర్ వ్యాలీలో ప్రాంతీయ పార్టీల కు, జమ్మూలో జాతీయ పార్టీలకు స్పష్టమై న ఆధిక్యత కనిపిస్తుంది. దీనికి అనుగుణంగానే మూడో విడతలో జమ్మూలో అధిక స్థానాలు ఉండడంతో పార్టీలు వ్యూహాత్మం గా వ్యవహరిస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక సమస్య లు, నిరుద్యోగం వంటి అంశాలకు ప్రాధాన్యత ఉండడం సర్వసాధారణం.

అయితే ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370, రాష్ట్ర హోదా పునరు ద్ధరణ, వేర్పాటువాదులు, పాకిస్తాన్‌తో చర్చలు వంటి భావోద్వేగ అంశాలు కీలకంగా మారుతున్నాయి. సున్నితమైన ఈ అంశాలపై  ప్రాంతాల వారిగా జమ్మూ కశ్మీర్ ప్రజల స్పందన ఎలా ఉంటుందో అక్టోబర్ 8 నాటి ఫలితాలే తేలుస్తాయి.

 వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్, 

పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ