calender_icon.png 20 October, 2024 | 5:13 AM

కర్వాచౌత్‌కు కాసుల పంటే!

20-10-2024 02:48:21 AM

  1. గతేడాది రూ.15 వేల కోట్లకుపైగా కొనుగోళ్లు
  2. 2024లో మరింత పెరిగే అవకాశముందని విశ్లేషకుల అంచనా

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: ఉత్తరాదిలో కర్వా చౌత్‌ను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఆధ్యాత్మికంగానే కాకుండా వ్యాపారపరంగానూ ఈ పండుగకు ఎంతో విశిష్ఠత ఉంది. అక్షయ తృతీయకే కాదు ఉత్తరాదిలో బంగారం, వెండి కొనుగోళ్లు భారీగా జరుగుతాయి.

ఆదివారం ఈ పండుగ జరగనున్న నేపథ్యంలో ఏ మేరకు కొనుగోళ్లు, వ్యాపారం జరుగుతాయనే అంచనాలు వాణిజ్య వర్గాల్లో నెలకొన్నాయి. కొన్నేళ్లుగా కొవిడ్ కారణంగా బంగారం కొనుగోళ్లు తగ్గాయి. కానీ గతేడాది కర్వాచౌత్ సందర్భంగా రూ.15 వేల కోట్లకుపైగా వ్యాపారం జరిగినట్లు అంచనా.

ఈ ఏడాది ఇది మరింత పెరిగే అవకాశముందని వ్యాపారవర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశవ్యాప్తంగా కనీసం రూ.22,000 కోట్ల వ్యాపారం ఆర్జించవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంచనాలు పండుగ సాంస్కృతిక, మతపరమైన ప్రాముఖ్యంతో పాటు పెరుగుతున్న ఆర్థిక స్థిరత్వాన్ని సూచిస్తున్నాయి. 

ఆర్థిక వేడుకగా ఉపవాస దీక్ష 

దేశంలో అనేక ప్రాంతాల్లో కర్వాచౌత్ రోజున హిందూ వివాహిత మహిళలు తమ జీవిత భాగస్వాముల దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తూ ఉపవాసం ఉంటారు. కానీ ఇది ఇప్పుడు ఒక పెద్ద ఆర్థిక వేడుకగా మారిందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పండుగలో మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించాలని ఢిల్లీలోని చాందినీచౌక్ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ పిలుపునిచ్చారు.

ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన వోకల్ ఫర్ లోకల్ చొరవతో పండుగను నిర్వహించాలని సూచించారు. తద్వారా స్వదేశీ వస్తువుల కొనుగోలును ఆయన ప్రోత్సహించారు. కర్వాచౌత్ సందర్భంగా బంగారమే కాకుండా సంప్రదాయంగా కొనుగోలు చేసే పూజ సామగ్రి, ఎర్ర గాజులు, చీలమండలు, మెట్టలు, లాకెట్లు, ఉత్తరాదిలో ఎక్కువగా వాడే కర్వాతాళీల అమ్మకాలు భారీ స్థాయిలో జరుగుతాయి.

పండుగ నేపథ్యంలో కేవలం ఢిల్లీలోనే రికార్డు స్థాయిలో రూ.4 వేల కోట్ల అమ్మకాలు జరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే కాకుండా ఢిల్లీలోని కన్నౌట్‌లో ఏర్పాటు చేసే మెహందీ స్టాల్స్‌కు సైతం ఎక్కువ ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు.