మందమర్రి (విజయక్రాంతి): కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని పట్టణంలోని వివిధ ఆలయాలు భక్తులతో కళకళలాడాయి. శుక్రవారం తెల్లవారుజామునే భక్తులు ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని పట్టణంలోని యాపల్ శివాలయంలో తెల్లవారుజామునే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు, స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు.
అలాగే మార్కెట్ లోని వెంకటేశ్వర ఆలయం, అయ్యప్ప ఆలయం, హనుమాన్ ఆలయంలలో భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. ఆయా ఆలయాలలో ఉదయం నుండే మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలయ ప్రాంగణంలోని ఉసిరి చెట్టు వద్ద దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాలలో భక్తులు పోటెత్తారు. స్టేషన్ రోడ్ లోని బ్రహ్మంగారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం నిర్వహించారు.
సాముహిక సత్యనారాయణ వ్రతాలు...
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని పట్టణంలోని వెంకటేశ్వరాలయం, అయ్యప్ప ఆలయంతో పాటు పలు ఆలయాలలో సాముహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఈ సందర్బంగా పూజలో పాల్గొన్న దంపతులు నియమ నిష్ఠలతో వ్రతాన్ని ఆచరించారు. అనంతరం ఆయా ఆలయాలలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్తీక పౌర్ణమిని సందర్బంగా పట్టణంలో ఆధ్యాత్మిక వాతావారణం నెలకొంది.