బెల్లంపల్లి (విజయక్రాంతి): కార్తీక పౌర్ణమి సందర్భంగా బెల్లంపల్లిలోని పలు శైవ క్షేత్రాలకు కార్తీక శోభ చేకూరింది. కార్తీక మాసం నెలలో వచ్చే పౌర్ణమికి విశేషమైన ప్రత్యేకత ఉండడంతో బ్రహ్మ ముహూర్తంలోనే పుణ్యస్నానాలు ఆచరించి మహిళలు శైవ క్షేత్రాలలో కార్తీక దీపాలను వెలిగించారు. బెల్లంపల్లి పట్టణంలోని శివాలయం, చంద్రవెల్లి గ్రామంలోని శ్రీ సోమేశ్వర దేవాలయం, లింగాపూర్ గ్రామంలోని శివాలయం, కన్నాల బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, కన్నాల ఫ్లైఓవర్ వద్దగల శివాలయాల్లో ఉదయం నుండే కార్తీకదీపాలను వెలిగించేందుకు మహిళలు పోటీపడ్డారు. పలు దేవాలయాల్లో మహిళలు కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. పట్టణంలోని శ్రీ వాసవి మాత దేవాలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలను నిర్వహించి భక్తులకు అన్నదానం చేపట్టారు. శ్రీ సాయిబాబా ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలను నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.