calender_icon.png 15 November, 2024 | 5:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెండితెరపై కార్తీక కాంతులు

15-11-2024 12:00:00 AM

కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు కాబట్టి ఈ మాసానికి అత్యంత ప్రాధాన్యతనిస్తారు. అందునా ఈ మాసంలో వచ్చే పౌర్ణమికి మరింత ప్రాధాన్యత ఉంటుంది. ఈ రోజంతా ఉపవాసముండి దగ్గరలోని శివాలయానికి వెళ్లి 365 వత్తులతో దీపాలను వెలిగిస్తారు. ఆ తరువాత ఉపవాసం వదిలేస్తారు. ఇలా చేస్తే శివుడి అనుగ్రహం మనపై ఉంటుందని నమ్మకం. ఈ నేపథ్యంలో ఆసక్తికరంగా సాగిన మూడు సినిమాలను మీ ముందుకు తెస్తున్నాం. అవే కార్తీక దీపం, కార్తీక పౌర్ణమి, పౌర్ణమి. 

కార్తీక దీపం సినిమా 1979లో రూపొందింది. ఈ చిత్రంలో కథానాయకుడు శోభన్ బాబు. లక్ష్మీదీపక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కథానాయికలుగా శారద, శ్రీదేవి నటించారు. గీత, గుమ్మడి, రాజనాల, అల్లు రామలింగయ్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరో సినిమా కార్తీక పౌర్ణమి 1987లో ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందింది.

శోభన్ బాబు, భానుప్రియ, రాధిక ప్రధాన పాత్రల్లో నటించారు. పరుచూరి సోదరులు రాసిన ‘నల్ల పూసలు’ అనే నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. సత్యనారాయణ, సుత్తివేలు, సుత్తి వీరభద్రరావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరో సినిమా పౌర్ణమి. ఈ చిత్రం గురించి దాదాపు ఇప్పటి సినీ ప్రియులందరికీ తెలిసే ఉంటుంది. ప్రభాస్ కథానాయకుడిగా రూపొందింది. ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో త్రిష, చార్మి కథానాయికలుగా నటించారు. 2006 ఏప్రిల్‌లో ఈ చిత్రం విడుదలైంది. రాహుల్ దేవ్, సింధు తులానీ, చంద్ర మోహన్, మంజు భార్గవి, సునీల్, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

పోలిక ఏంటంటే..? 

ఈ మూడు సినిమాలకు, కార్తీక పౌర్ణమికి ఉన్న సంబంధం పైకి ఏమీ కనిపించదు కానీ ఒక రకమైన మోటివ్ మనకు ఇన్నర్‌గా కనిపిస్తుంది. మూడు సినిమాలకూ ఉన్న ఒక పోలిక ఏంటంటే.. ఇద్దరు కథానాయికలు. మూడు చిత్రాల్లోనూ ఇద్దరేసి కథానాయికలు మనకు కనిపిస్తారు. వాస్తవానికి శోభన్ బాబు చిత్రమంటే ఇద్దరు కథానాయికలుగా దాదాపుగా మనకు కనిపిస్తారు. ఈ సినిమాల కథ పరంగానూ ఇద్దరు హీరోయిన్లు తప్పనిసరి. ప్రభాస్ పౌర్ణమి చిత్రాన్ని తీసుకున్నా ఇద్దరు హీరోయిన్లు ఉండాల్సిందే. కార్తీక పౌర్ణమి సినిమా కథేంటంటే..

భానుప్రియ ఒక జాలరి కూతురు. తండ్రి చేపలు పట్టుకుని తద్వారా జీవనాన్ని సాగిస్తుంటాడు. ఆ ఊరికి ఉద్యోగ నిమిత్తం వెళ్లిన శోభన్‌బాబు.. భానుప్రియలోని కళను గుర్తించి ఆమెను ఒక దేశం గర్వించే కళాకారిణిగా తయారు చేస్తాడు. ఆమెను ఉన్నతంగా తీర్చిదిద్ది ఆమె జీవితంలో పౌర్ణమి వెలుగులు తీసుకొస్తాడు. ఈ తరుణంలో రాధికను వివాహం చేసుకోవడం..

ఆమె భానుప్రియను అపార్థం చేసుకోవడం ఆ తరువాత జరిగే పరిణామాలన్నీ ఆసక్తికరంగా సాగుతాయి. అమావాస్య చందమామలా మబ్బుల మాటున దాగిన భానుప్రియలోని కళను ప్రపంచానికి పరిచయం చేసి ఆమె జీవితాన్ని కార్తీక పున్నమి అంత ఉన్నతంగా తీర్చిదిద్దుతాడు.

ఎందుకు మాయమైంది?

కార్తీక దీపం సినిమా విషయానికి వస్తే.. శోభన్ బాబు, శారద భార్యాభర్తలు. అన్యోన్యంగా సాగుతున్న వారి సంసారంలోకి శ్రీదేవి రావడం.. ఆ తరువాత జరిగే పరిణామాలు.. ముందుగానే శోభన్ బాబుకు శ్రీదేవి తెలిసి ఉండటం. వారిద్దరికీ ఒక బాబు పుట్టడం, చివరకు శ్రీదేవి మరణించడం వంటి అంశాలతో చిత్రం రూపొందింది. శ్రీదేవిని ఒక అపాయం నుంచి బయటకు తీసుకొచ్చి శోభన్ బాబు కాపాడి, చేరదీసి ఆమెకు మంచి జీవితాన్నిస్తాడు.

కార్తీక మాసంలో మనకు వినిపించే ‘ఆరనీకుమా ఈ దీపం.. కార్తీక దీపం...’ పాట ఈ చిత్రంలోనిదే. ఇక పౌర్ణమి చిత్రం విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ మారుమూల గ్రామంలో 1507లో వినాశకర కరువు సంభవిస్తుంది. అప్పుడు చంద్రమోహన్ వంశంలోని స్త్రీ త్యాగం కారణంగా వర్షం వస్తుంది. అప్పటి నుంచి ప్రతి 12 ఏళ్లకోసారి ఆ వంశంలోని స్త్రీ పౌర్ణమినాడు ఆలయంలో ఆచార నృత్యం చేస్తుంది.

అలా పౌర్ణమి (త్రిష) వంతు వస్తుంది. ఆమె గ్రామం నుంచి మాయమవుతుంది. అసలు పౌర్ణమి ఎందుకు మాయమైంది? ఆ ఊరిని కరువు బారి నుంచి ఎవరు గట్టెక్కించారు? వంటి అంశాలతో రూపొందింది. మూడు చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. 

- ప్రజావాణి చీదిరాల