calender_icon.png 24 October, 2024 | 6:52 AM

కర్తార్‌పూర్ ఒప్పందం ఐదేళ్లు పొడిగింపు

24-10-2024 02:55:12 AM

ఈ ఏడాదితో ముగియనున్న గడువు

ఒప్పందం పొడిగింపునకు భారత్, పాక్ గ్రీన్ సిగ్నల్ 

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: కర్తార్‌పూర్ కారిడార్ విషయంలో భారత్, పాక్‌లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. భారత్‌కు చెందిన భక్తులు పాక్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను దర్శించుకునేందుకు ఉపయోగపడుతున్న కర్తార్‌పూర్ కారిడార్ విషయం లో గతంలో చేసుకున్న ఒప్పందాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగించేందుకు ఇరు దేశాలు అంగీకారం తెలిపాయి. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ బుధవారం ప్రకటించింది. ఈ కారిడార్ గుండా వెళ్తున్న ప్రతి ఒక్క భక్తుడి నుంచి పాక్ ప్రభుత్వం 20 డాలర్ల వరకూ సర్వీస్ ఛార్జి పేరిట వసూలు చేస్తోంది. అయితే భక్తుల నుంచి ఎటువంటి ఛార్జి వసూలు చేయవద్దని ఆ దేశ ప్రభుత్వాన్ని కోరినట్టు విదేశాంగశాఖ ఈ సందర్భంగా తెలిపింది. కాగా.. రెండు దేశాల మధ్య తాజాగా కుదిరిన ఒప్పందంతో భారత్‌కు చెందిన భక్తులు మరో ఐదేళ్లపాటు ఎటువంటి వీసా అవసరం లేకుండా పాక్ వెళ్లి, సిక్కుల పవిత్ర స్థలాన్ని దర్శనం చేసుకోవచ్చు. గురునానక్ 550వ జయంతి సందర్భంగా 2019 నవంబర్ 9న ఈ కారిడార్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు.