26-04-2025 06:08:57 PM
బెంగళూరు,(విజయక్రాంతి): బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యారావుకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ రన్యారావు, మరో నిందితుడు తరుణ్ రాజు దాఖాలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను కర్ణాటక హైకోర్టు శనివారం తోసిపుచ్చింది. ఇంతలో, రాన్యారావుపై విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణ చట్టం, 1974 (COFEPOSA) కేసు నమోదు చేయబడింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) సిఫార్సు ప్రకారం, ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని నోడల్ ఏజెన్సీ అయిన సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో (CEIB), నటి, ఇతర నిందితులపై కాఫీఫోసా చట్టం (COFEPOSA Act) కింద వారికి ఒక ఏడాది పాటు బెయిల్ లభించే అవకాశం ఉండదని అధికారులు వెల్లడించారు.
నిందితులు బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత స్మగ్లింగ్‌కు పాల్పడకుండా ఆపడానికి, అలాగే వారు దర్యాప్తు సంస్థలకు సహకరించడం లేదని తేలితే కూడా ఈ చట్టం ప్రయోగించబడుతుందని వర్గాలు తెలిపాయి.ఈ కేసులో రాన్యారావు, ఇతరులు బెయిల్ పొందడానికి పదే పదే ప్రయత్నించిన నేపథ్యంలో కేంద్ర సంస్థలు ఈ చర్య తీసుకున్నాయని వర్గాలు వెల్లడించాయి. ఇతర నిందితులైన తరుణ్ రాజు మరియు సాహిల్ సకారియా జైన్‌పై కూడా కోఫెపోసా చట్టం కింద కేసు నమోదు చేయబడ్డాయి. సీనియర్ ఐపీఎస్ అధికారి రామచంద్రరావు సవతి కుమార్తె రన్యా రావును మార్చి 3వ తేదీన రూ.12.56 కోట్లకు పైగా విలువైన 14.2 కిలోగ్రాముల బంగారాన్ని అక్రమంగా రవాణా చేశారనే ఆరోపణలతో అరెస్టు చేశారు. ప్రస్తుతం నటి రాన్యారావు, మిగిలిన ఇద్దరు నిందితులు బెంగళూరు సెంట్రల్ జైలులో ఉన్నారు.
ఈ కేసును డీఆర్‌ఐ(DRI), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI) దర్యాప్తు చేస్తున్నాయి. డీజీపీ రామచంద్రరావు పాత్రను పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఎఎస్ అధికారి నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ విషయంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు వర్గాలు తెలిపాయి. బంగారు స్మగ్లింగ్ కేసు దర్యాప్తులో మూడవ నిందితుడైన సాహిల్ జైన్‌తో కలిసి నటి హవాలా లావాదేవీలకు పాల్పడిందని డీఆర్ఐ వెల్లడించింది. బంగారు స్మగ్లింగ్ కేసులో జైన్ అరెస్టుకు సంబంధించి ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టుకు సమర్పించిన రిమాండ్ దరఖాస్తులో, ఆభరణాల వ్యాపారి, రన్యా రావు హవాలా సంబంధంలో పాల్గొన్నారని డీఆర్ఐ అధికారులు ఆరోపిస్తున్నారు.
జైన్ సహాయంతో రన్యా రావు 49.6 కిలోల బంగారాన్ని విక్రయించి, రూ.38.4 కోట్ల హవాలా డబ్బును దుబాయ్‌కు బదిలీ చేసినట్లు దర్యాప్తులో తేలింది.బళ్లారికి చెందిన జైన్ బెంగళూరులో స్థిరపడి, దాదాపు రూ.40 కోట్ల విలువైన 49.6 కిలోగ్రాముల బంగారాన్ని విక్రయించడంలో, రూ.38.4 కోట్ల హవాలా డబ్బును దుబాయ్‌కు బదిలీ చేయడంలో రన్యా రావుకు సహాయం చేసి, ప్రోత్సహించాడని దర్యాప్తులో తేలిందని డీఆర్ఐ పేర్కొంది. దీంతో బెయిల్ కోసం రాన్యారావు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించడంతో విచారణ చేపట్టిన జస్టిస్ సావనూర్ విశ్వజిత్ శెట్టి నేతృత్వంలోని ధర్మాసనం బెయిల్ పిటిషన్ పై ఇప్పటికే తీర్పు రిజర్వు చేసిన కోర్టు తాజాగా కొట్టివేస్తూ ఉత్తర్వును జారీ చేసింది.