calender_icon.png 28 February, 2025 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీకేపై గుర్రుగా కాంగ్రెస్

27-02-2025 11:24:10 PM

ఇషా ఫౌండేషన్ శివరాత్రి వేడుకలకు కర్ణాటక డిప్యూటీ సీఎం

ఆయన తీరుపై ఏఐసీసీ కార్యదర్శి పీవీ మోహన్ ఆగ్రహం

పార్టీ మూలాలను దెబ్బ తీస్తున్నట్టు విమర్శ

పుట్టుకతోనే కాంగ్రెస్ వాదినన్న శివకుమార్

బెంగళూరు: ఇషా ఫౌండేషన్ నిర్వహించిన మహాశివరాత్రి వేడుకలకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరుకావడం ప్రస్తుతం వివాదాస్పదం అయింది. శివరాత్రి వేడుకలకు డీకే హాజరుకావడంపై సొంత పార్టీ నేతలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. శివకుమార్ చర్యలు పార్టీ మూలాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ ఏఐసీసీ కార్యదర్శి పీవీ మోహన్ ఎక్స్ వేదికగా ఆరోపించారు. ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవ్ ఆహ్వానంపట్ల ఆయనకు కృతజ్ఞతలు చెబుతూ డీకే శివకుమార్ ఎక్స్‌లో పెట్టిన పోస్ట్‌ను పీవీ మోహన్ ట్యాగ్ చేశారు. లౌకిక పార్టీకి అధ్యక్షులుగా పని చేస్తూ రాహుల్ గాంధీని ఎగతాళి చేసిన వ్యక్తికి ఎలా కృతజ్ఞతలు చెబుతావని డీకేను ప్రశ్నించారు. అయితే తాను డీకేను విమర్శించడం లేదని.. ఆయన సైద్ధాంతిక మార్గాల గురించి మాత్రమే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్టు మోహన్ పేర్కొన్నారు.

ఇషా పౌండేషన్, జగ్గీ వాసుదేవ్ సిద్ధాంతాలు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలతో ఏకీభవిస్తాయని వెల్లడించారు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలానికి కాంగ్రెస్ పూర్తిగా వ్యతిరేకమని... సంఘ్ సిద్ధాంతాలను పాటించేవాళ్లు పార్టీ నుంచి వెళ్లిపోవచ్చంటూ రాహుల్ గాంధీ పదేపదే పేర్కొన్నట్టు గుర్తు చేశారు. కాగా జగ్గీ ఆహ్వానం మేరకు శివకుమార్ ఇషా ఫౌండేషన్ బుధవారం నిర్వహించిన శివరాత్రి వేడుకలకు హాజరై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో వేదిక పంచుకున్నారు. కుంభమేళాలో పాల్గొనడం, ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలోని వేడుకలకు హాజరైన నేపథ్యంలో బీజేపీకి డీకే దగ్గరవుతున్నారనే ఊహగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఆరోపణలను విలేఖరుల సమావేశంలో డీకే ఖండించారు. పుట్టుకతోనే తాను కాంగ్రెస్‌వాదినని స్పష్టం చేశారు. సద్గురు మైసూరుకు చెందిన వ్యక్తి కావడం, ఆయనకు ఉన్న విజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవంతో వేడుకలకు హాజరైనట్టు వివరించారు. ఈ క్రమంలో తాను కేంద్ర మంత్రి అమిత్‌షాతో భేటీ కాలేదని స్పష్టం చేశారు